విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మద్యలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన చేసినప్పుడే సిఎం చంద్రబాబు నాయుడు విమానాశ్రయం ఒక్కటే కాదు.. దానికి అనుబందంగా ఏవియేషన్ హబ్, దానిలో విమానాల మరమత్తుల కేంద్రం, పైలట్ శిక్షణా కేంద్రం, విమాన రంగానికి సంబందించిన పరిశ్రమలు, ఇంకా హోటల్స్, షాపింగ్ మాల్స్ వంటివన్నీ ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, వాటన్నిటి వలన చుట్టు పక్కల జిల్లాలు, ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు.
ఆ ప్రకారమే భోగాపురం విమానాశ్రయానికి 2,203 ఎకరాలు సేకరించి నిర్మాణ సంస్థ జీవీఐఏఎల్‌కు అప్పగించారు. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైనంత భూమి, అన్ని అనుమతులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా లభిస్తుండటంతో శరవేగంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి భోగాపురం నుంచి విమాన సేవలు మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు.
Also Read – విజన్ 2029 కూడా అవసరమేగా?
కానీ ఇప్పుడు మరో 500 ఎకరాలు కేటాయించాలని జీవీఐఏఎల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విమానాశ్రయం చుట్టుపక్కల మరింత అభివృద్ధి చేసేందుకు ఇది అవసరమని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,203 ఎకరాలు ఇచ్చినందున ఈ ప్రతిపాదనని వెంటనే తిరస్కరించవచ్చు. కానీ ఈ ప్రతిపాదన, లాభనష్టాలు, ప్రభుత్వంపై పడే అదనపు భారం, భూసేకరణలో వచ్చే సమస్యలు అన్నిటిపై అధ్యయనం చేసేందుకు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్ సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Also Read – సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్స్…. భయపెడుతున్నాయి!