మెగాస్టార్ సినిమా “కత్తి” సినిమా రీమేక్ కధ విషయంలో ఏర్పడిన గందరగోళంలో దర్శకరత్న దాసరి కీలక పాత్ర పోషించాడని అప్పట్లో వార్తలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ – దాసరిల మధ్య వైరం మరోసారి స్పష్టమైందని సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరిగింది. చాలా సందర్భాలలో వీరిద్దరి మధ్య విబేధాలు బయటపడినా, ఇద్దరూ మాత్రం బహిరంగంగా వాటిని అంగీకరించరు. మరో విశేషమేమిటంటే… ఈ ఇద్దరూ కూడా ఒకే కుల (కాపు) వర్గానికి చెందిన వారు.
అయితే ప్రస్తుతం కాపు కులస్తులను బీసీల్లో చేర్చాలంటూ… తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి గ్రామంలో ముద్రగడ మరియు ఆయన సతీమణి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని దాసరి నారాయణరావు స్పష్టం చేసారు. ముద్రగడ తీసుకున్న చొరవ అభినందనీయమని, ఏళ్ళ తరబడి ఉన్న ప్రశ్నకు సమాధానం లభించాలని, ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంకు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసారు దాసరి.
ఇదెలా ఉంటే… “నా ప్రాణం నా జాతికే అంకితం. కాపులకు రిజర్వేషన్లు దక్కే దాకా పోరాటం ఆగదు, శాంతియుత, గాంధేయ మార్గంలో దీక్ష కొనసాగుతుందని” ముద్రగడ పద్మనాభం స్పష్టం చేసారు.



