పీ-4: తొలి అడుగు సిఎం చంద్రబాబు నాయుడే వేశారుగా!

CM Chandrababu P4

జగన్‌ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచిపెడితే వారి జీవన ప్రమాణాలు పెరిగి, బీదరికం నుంచి బయటపడతారని వితందవాదన చేస్తూ 5 ఏళ్ళు అలాగే ముందుకు సాగారు. అదే నిజమైతే నేడు సంక్షేమ పధకాల కోసం ఎదురు చూసేవారు ఉండకూడదు కదా? కానీ నేటికీ కోట్లమంది ఎదురుచూస్తూనే ఉన్నారు. అంటే ప్రజలకు డబ్బు పంచిపెడితే సరిపోదని స్పష్టమవుతోంది.

ప్రజలకు ‘మేలు’ చేస్తున్నానని జగన్‌ చెప్పుకున్నప్పటికీ ఆ ‘మేలు’ని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలనుకున్నారు. అంటే జగన్‌ ముఖ్యోదేశ్యం ప్రజలకు ‘మేలు’ చేయడం లేదా ‘జీవన ప్రమాణాలు’ పెంచడమో కాదు వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవడమే అని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. కనుక కూటమి ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకు బలోపేతం చేసుకుంటోందని చెప్పక తప్పదు. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపించే అన్ని రాజకీయ పార్టీలు ఇదే చేస్తున్నాయి.

అయితే సిఎం చంద్రబాబు నాయుడు కేవలం ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకుడు కారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ప్రజలకు ఆదాయ మార్గాలు సృష్టించాలనుకుంటారు. ఇటువంటి పనులు చేసి మంచిపేరు, ప్రజాదరణ పొందాలని కోరుకుంటారు తప్ప సంక్షేమ పధకాలతో కాదు.

ఓ పక్క సంక్షేమ పధకాలు అమలుచేస్తూ, మరో పక్క ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తూనే, ఈ అవకాశాలను అందిపుచ్చుకోలేని నిరుపేదల గురించి కూడా ఆలోచన చేయడం కేవలం సిఎం చంద్రబాబు నాయుడుకే చెల్లు. అటువంటి వారి కోసమే పీ-4 అనే సరికొత్త కార్యక్రమం చేపట్టారు. పీ-4 అంటే విరాళాల సేకరణ కానేకాదు. ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన నిరుపేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ‘బంగారు కుటుంబాలు’ అని నామకరణం చేయడం చాలా అభినందనీయం.

సమాజంలో ఉన్నత వర్గాలు ఈ బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి కాళ్ళపై వారు నిలబడే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ తోడ్పడాలి. వారికీ- బంగారు కుటుంబాలకు మద్య ప్రభుత్వం, అధికారులు వారధిగా నిలుస్తూ ఒక్కో కుటుంబం నిలదోక్కుకోవడానికి మార్గదర్శనం చేస్తుంటారు.

సిఎం చంద్రబాబు నాయుడు ఏదో మొక్కుబడిగా ఈ పీ-4 కార్యక్రమం ప్రకటించి చేతులు దులుపుకోలేదు. స్వయంగా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.

ముఖ్యమంత్రే ముందుగా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నప్పుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తప్పకుండా దీనిలో భాగస్వాములవుతారని వేరే చెప్పక్కరలేదు. సిఎం చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయంలో ఈ పీ-4 లోగో, బ్యాడ్జిని ఆవిష్కరించారు.

ADVERTISEMENT
Latest Stories