పీవీకి భారతరత్న… జగన్‌ నో కామెంట్స్!

National Media Mocking Jagan

దివంగత ప్రధాని మన తెలుగువారు అయిన పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ స్వాగతించారు. చాలా సంతోషించారు. పీవీ గురించి తమకు తెలిసిన నాలుగు మంచి ముక్కలు చెప్పుకున్నారు కూడా.

పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించినప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. కనుక బయటకు వచ్చినప్పుడు మీడియాతో పీవీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తారని ఆశించడం సహజం. కానీ మాట్లాడలేదు!

ADVERTISEMENT

పీవీకి భారతరత్న అవార్డు వచ్చిన్నట్లు జగన్మోహన్‌ రెడ్డికి తెలియక మాట్లాడలేదనుకోవడానికి కూడా లేదు. పార్లమెంట్‌ బయట వేచి ఉన్న మీడియా ప్రతినిధులు “సార్.. సార్… మీ తెలుగువాడు పీవీకి భారతరత్న అవార్డు వచ్చింది… మీ స్పందన ఏమిటి?” అంటూ జగన్‌ వెంటపడి అడుగుతున్నా వారికి చేతులు జోడించి దణ్ణం పెడుతూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్ళిపోయారు.

జగన్‌ తీరు చూసి మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పీవీకి భారతరత్న అవార్డు అనేది వివాదాస్పదమైన విషయం కాదు. చాలా సంతోషించాల్సిన విషయమే. కానీ ఆయన గురించి మాట్లాడేందుకు ఏపీ సిఎం ఎందుకు ఇష్టపడలేదో వారికి అర్దం కాలేదు.

అంటే పీవీ గురించి జగన్‌కు ఏమీ తెలియక మాట్లాడలేదా?చెల్లి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి గట్టిగా నిలదీస్తునందున, పీవీని కూడా కాంగ్రెస్‌ నేతగానే చూడటం వలన మాట్లాడలేదా?లేక ప్రధాని నరేంద్రమోడీ చివాట్లు పెట్టడం వలన చిరాకుగా ఉన్నారా?లేక టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకొంటుందని, కనుక ఇకపై వాటి జోలికి వెళ్ళవద్దని ప్రధాని నరేంద్రమోడీ వార్నింగ్ ఇచ్చారా?ఆ కారణంగా తీవ్ర అసహనం, అసంతృప్తి, ఆగ్రహంగా ఉన్నందునే పీవీ గురించి మాట్లాడేందుకు జగన్‌ నిరాకరించారా?

కారణాలు ఏవైనాప్పటికీ ఓ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి పార్లమెంట్ బయట మీడియాతో పీవీ గురించి నాలుగు ముక్కలు మాట్లాడకపోవడం చాలా అసహజంగా ఉంది.

కానీ తెలంగాణ శాసనసభ సమావేశాలలో ఉన్న ఆ రాష్ట్ర సిఎం రేవంత్‌ రెడ్డితో సహా సభలో అందరూ పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించడంపై చాలా సంతోషం వ్యక్తం చేశారు.

నిజానికి జగన్మోహన్‌ రెడ్డి పీవీ గురించి మాట్లాడక పోవడం వలన ఓ చక్కటి రాజకీయ అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు. పీవీ గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడితే, ప్రజల దృష్టిలో జగన్‌ గౌరవం ఎంతో కొంత పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి ఉంటే ఏపీ ప్రజలందరూ సంతోషించి ఉండేవారు. ఎన్నికలకు ముందు ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తాయని వేరే చెప్పక్కరలేదు. కానీ జగన్‌ ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories