జగన్ బటన్ నొక్కడానికి బహిరంగ సభలు పెట్టడం ప్రతిపక్షాలను తిట్టడం అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షాలను విమర్శించడం ఒక ఎత్తైతే తనకు మద్దతు పలకని మీడియాను.., పదే పదే yellow మీడియా అంటూ రంగులు ఆపాదించడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి సబబుకాదు. అందునా జగన్ ఒక మీడియా అధినేతగా ఉంటూ మనస్ ‘సాక్షి’ లేకుండా విమర్శలు చేయడం కాస్త విడ్డురంగా ఉంది.
ABN, TV5, ఈనాడు పత్రికల విలేకరులను కించపరచడం.., ఆయా పత్రికాధిపతులను ఎద్దేవా చేయడం జగన్ కు పరిపాటుగా మారింది. తాను ముఖ్యమంత్రిని తన విధానాలను ఎవరు విమర్శించినా వారికి పసుపు రంగు అంటించడం జగన్ లో ఉన్న నియంతను బయటపెడుతోంది.ఇది రాజరికం కాదు అనేది వైసీపీ గుర్తించాలి.
జగన్ అన్నదే కాసేపు నిజమని భావించినా… రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక దిన పత్రికలు.., మీడియా ఛానళ్ళు ఉన్నాయి..! ఈ మూడు yellow మీడియా అయితే మిగిలినవి blue మీడియానా? నాకు వారిలా ఒక ఆంధ్ర జ్యోతి లేదు, ఒక టీవీ 5 లేదు, ఒక ఈనాడు లేదు, ఒక దత్త పుత్రుడు లేడు. మీ బిడ్డ పోరాడుతుంది ఒక దుష్ట చతుష్టయం తో అంటూ స్క్రిప్ట్ అప్పచెప్పే ముఖ్యమంత్రి గారు మిగిలినవన్నీ “బ్లూ” మీడియాలే అంటూ పరోక్షంగా ఒప్పుకుంటున్నారు.
అయితే జగన్ చేస్తున్న ఈ పత్రిక స్వేచ్ఛ హననానికి ప్రతిపక్ష నేతలు కానీ మీడియా అధినేతలు కానీ గట్టి కౌంటర్ వేయలేక పోవడం జగన్ కు అలుసుగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు డిఫెన్స్ చేసుకోవడం తోనే అటు టీడీపీ ఇటు మీడియా ఛానళ్లు సరిపెడుతున్నారు కానీ కౌంటర్అ ట్టాక్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.
మూడు పెళ్లిళ్లు..,మూడు పెళ్ళాలు… అంటూ పవన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయ వేదికల పై విమర్శలకు వాడుకున్న జగన్, పవన్ వారాహి యాత్రతో ఇచ్చిన గట్టి కౌంటర్ తో ఒక అడుగు వెనక్కి వేసాడని చెప్పాలి. మీ తల్లితండ్రులు కనీసం సంస్కారం కూడా నేర్పలేదా? పెళ్ళాలు.. ఏంటి భార్య, సతీమణి అంటూ మర్యాదగా పిలవడం కూడా రాదా జగన్? అంటూ పవన్ ఎటాక్ మోడ్ లోకి వెళితే కానీ జగన్ డిఫెన్స్ లోకి రాలేదు.
టీడీపీ నేతలు కూడా తమ మెతక వైఖరిని, అలసత్వాన్ని వదిలి మీరన్నట్టే ఈ మూడు పసుపు మీడియా అయితే మిగిలినవి బ్లూ మీడియానేగా ?అంటూ కౌంటర్ అట్టాక్ట్ చేస్తేనే జగన్ అండ్ కో దూకుడికి కళ్లెం వేయగలరు. అవును మాకు మీకు మాదిరి సాక్షి పత్రిక కానీ మీ ఎంపీ RRR చెపుతున్నట్టు సాక్షికి మారు పేర్లుగా పిలవబడే మరికొన్ని బ్లూ మీడియాలు కానీ లేవు., మాకు మీ మాదిరి హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసే ఎమ్మెల్సీ లు లేరు.., సొంత బాబాయిని హత్య చేస్తే ఆ నిందితులను వెనకేసుకు వచ్చే గొప్ప మనసు లేదు…అంటూ కౌంటర్లు వేసైనా ఒక వర్గం మీడియా పై జరుగుతున్న దాడిని నివారించగలరు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తలుచుకుంటే సాక్షి తెలుగు రాష్ట్ర ప్రజల ఇళ్లలోకి వచ్చేదా? ఎవరు అధికారంలో ఉన్న వారిని, వారి ప్రభుత్వ విధానాలను విమర్శించే గొంతులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అలా అని ప్రతి ఒక్కరిని తొక్కేస్తా., అడ్డొస్తే అణిచేస్తా అనే ధోరణి ఆమోదయోగ్యం కాదు.
విమర్శకులతో కూడా ప్రశంసలు తెచ్చుకోవడమే అసలైన విజయం. ఒకప్పుడు పప్పు అన్న గొంతులను ఒకే ఒక ఇంటర్వ్యూ తో మూపించి ప్రశంసలు దక్కించుకున్నారు లోకేష్. అయినా ప్రస్తుత కాలంలో మీడియా ఎదో రంగు వేసుకునే పని చేస్తుందనేది బహిరంగ సత్యమే. అయితే రంగులను విమర్శించే స్థాయికి ముఖ్యమంత్రి పదవి దిగజారే కూడదని జగన్ గుర్తిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాగే మీడియాలు కూడా తమకు అనుకూలంగా లేని వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడని ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని విమర్శన కోణంలో చూడకూడదు. సద్విమర్శలు రాష్టానికి మంచి చేస్తాయి అని మీడియా సోదరులు కూడా గ్రహించాలి.



