ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార – విపక్షాల మధ్య ఇప్పుడేం నడుస్తుంది అంటే క్రెడిట్ చోరీ వివాదం నడుస్తుంది అని యిట్టె చెప్పవచ్చు. ఏపీలో పట్టాలెక్కుతున్న అభివృద్ధి పనులు, అలాగే ఏపీలో పెట్టుబడుల కోసం తరలి వస్తున్న పరిశ్రమల విషయంలో టీడీపీ – వైసీపీ మధ్య ఈ క్రెడిట్ రాజకీయం సాగుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖకు గూగుల్ సెంటర్, అదానీ డేటా సెంటర్లు వచ్చాయి. అయితే ఈ సెంటర్ల ఏర్పాటు కూటమి ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఆ ఏర్పాటు వెనుక కర్త, కర్మ, క్రియ మొత్తం జగనే అంటూ వైసీపీ ఆ సెంటర్ క్రెడిట్ లబ్దిదారులం మేమే అంటూ మీడియాలో క్రెడిట్ కోసం రచ్చ మొదలుపెట్టింది.
అలాగే విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో కూడా ఆ క్రెడిట్ మాకే సొంతమంటూ జగన్ టీడీపీ ని క్రెడిట్ చోరీ పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఇక తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సుమారు 1.25 కోట్ల పెట్టుబడితో మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది.
దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం మిట్టల్ కంపెనీ ఏపీని ఎంచుకోవడం వెనుక కూడా జగన్ హస్తం ఉందంటూ జగన్ నుంచి వైసీపీ నేతల వరకు మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. ఇక కుప్పం కి కృష్ణ జలాల పంపిణి, వెలిగొండ ప్రాజెక్ట్ వెనుక కూడా జగనే ఉన్నారని, ఆ ప్రాజెక్ట్ లు, ఈ పరిశ్రమల క్రెడిట్ లబ్ధిదారుడు వన్ అండ్ ఓన్లీ జగన్ అంటూ వైసీపీ తెగ ప్రచారం చేసుకుంటుంది.
అలాగే జగన్ కూడా ఇవన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పట్టాలెక్కిన ప్రోజెక్టులని, ఏపీకి తరలివచ్చిన పరిశ్రమలని చెప్పుకుంటూ ఈ అభివృద్ధికి గాను క్రెడిట్ తనకే దక్కాలని, కానీ బాబు తనకు రావాల్సిన క్రెడిట్ ని చోరీ చేస్తూ తానూ లబ్దిపొందుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోపక్క టీడీపీ గూగుల్ సెంటర్ ఏర్పాటు నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకు, అదానీ డేటా సెంటర్ ఎంఓయూ ల నుంచి మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాన వరకు నాడు జగన్ ఎం చెప్పారు నేడు ఎం మాట్లాడుతున్నారు అనేదానికి సంబంధించిన జగన్ వీడియో బైట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీనితో వైసీపీ క్రెడిట్ చోరీ అంటూ చేస్తున్న రాజకీయం వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు ఆ పథకం తాలూకా నిజమైన లబ్ధిదారులు జగనో, బాబో కాదు వారికీ ఆ బాధ్యతను కట్టబెట్టిన ప్రజలే ఈ పథకానికి అసలైన లబ్దిదారులు అనేది స్పష్టమవుతుంది.






