జూన్ 4 ఏ పార్టీని మడతపెడుతుందో..?

TDP YCP JSP

ప్రతి అయిదు సంవత్సరాలకు సార్వత్రిక ఎన్నికలు జరగడం షరామామూలే! అలాగే ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? క్రేజీగా మారిన నియోజక వర్గాలలో ఎంత మెజారిటీ వస్తుంది? అన్న ఉత్సుకత రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ ఉంటుంది.

ఈ సారి కూడా అందుకు విరుద్ధమేమీ కాదు గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024 ఎన్నికల ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారిన తరుణంలో… ఫలితాలు వెలువడడానికి కొద్దీ గంటల సమయమే మిగిలి ఉండడంతో జూన్ 4వ తేదీ ఉదయానికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా సర్వం సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT

మళ్ళీ వైసీపీ జెండా ఏపీలో ఎగిరితే… రాష్ట్రం విడిచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోతామని గత ఆరేడు మాసాలుగా అతి సామాన్య ప్రజల్లో విరివిగా వినిపించిన మాటలు. దీంతో సామాన్య ప్రజానీకం ఈ ఎన్నికలకు ఎంత విలువనిచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రభావమే ఓటింగ్ శాతంలో కూడా కనిపించిందనేది రాజకీయ విశ్లేషకుల భావన.

ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే… ‘వై నాట్ 175’ అన్న వైసీపీ, పోలింగ్ జరిగిన తర్వాత తన సరళిని పూర్తిగా మార్చుకుని, ‘చంద్రబాబు, పవన్ లను ఓడిస్తామని మేమెక్కడ చెప్పాము’ అంటూ సజ్జల వంటి వారు మాటలను మడత పెట్టారు. ‘రేపు ఉదయం 10.30 నిముషాల తర్వాత వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమైపోండి’ అంటూ తాజాగా పిలుపునిచ్చారు కూడా!

కూటమిగా పోటీ చేసిన టీడీపీ+జనసేన+బీజేపీలు పోలింగ్ ముందు నుండి ఎగ్జిట్ పోల్స్ వరకు ఆత్మవిశ్వసాన్ని మెండుగా ప్రదర్శించాయి. ఫలితాలు బహిర్గతం కాబోతున్న తరుణంలో రెట్టించిన ఉత్సాహంతో ఈ మూడు పార్టీల అధినేతలు – నేతలు – కార్యకర్తలు మునిగి తేలుతున్నారు. ఈ జోష్ నంతా మరో రోజు దాచి ఉంచండి, రేపు విజయోత్సవ సంబరాలు చేద్దామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.

ఈ రెండు వర్గాలతో పాటు ఆఖరి నిముషంలో 2024 ఎన్నికలలో ‘తురుపుముక్క’ మాదిరి రంగప్రవేశం చేసిన వైఎస్ షర్మిల ఎంపీ స్థానం కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ ను ఏకిపారేసిన షర్మిల, ‘ఆడబిడ్డగా అడుగుతున్నాము – న్యాయం చేయండి’ అంటూ చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఈ ఎన్నికలలో అత్యంత క్రేజీగా మారిన అసలు విషయం ఏమిటంటే…. ‘పవన్ కళ్యాణ్ అనే నేను…’ పిలుపు వినడం ఖాయంగా మారిన తరుణంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ – జనసైనికులు అందరి కంటే రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. ఇప్పటికే ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ ఏపీ అంతటా ‘ట్రెండింగ్’ చేస్తోన్న జనసైనికుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే!

జూన్ 4వ తేదీ ఉదయం 8.30 నిముషాలకు పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభం కానున్న కౌంటింగ్, 10 గంటలకల్లా ట్రెండింగ్ తెలిసిపోతుంది. ఒకవేళ రెండు పార్టీల నడుమ గట్టిపోటాపోటీ ఫైట్ జరిగితే, మధ్యాహ్న సమయం 1-2 గంటల నడుమ తుది ఫలితాలకు ఆస్కారం దొరుకుతుంది. అప్పటినుండి ఆయా పార్టీల సంబరాలు అంబరాన్ని తాకుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

విభజనతో ఎంతో కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో బుడిబుడి అడుగులు వేస్తూ ప్రయాణం మొదలుపెట్టగా, 2019 నుండి గమ్యం లేని ప్రయాణంగా మారిపోయి, రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్ధకంలో పడేసింది. దీంతో ఈ సారి ఎలా అయినా నడక మొదలుపెట్టి, రాబోయే అయిదు సంవత్సరాలలో పరుగులు పెట్టే విధంగా ఏపీ మారాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories