పెట్రోల్ ధరలు ‘షాక్’ ఇస్తున్నాయి…పవర్ కట్స్ ‘మంట’ పుట్టిస్తున్నాయి..

నేడు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ. 2.84, డీజిల్ పై రూ. 2.86 చొప్పున పెరగడంతో ప్రజలు, ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రభుత్వాల పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా మరో మూడు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఎన్డీయే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను అంచలంచెలుగా పెంచుతూ వినియోగదారుల పై తీవ్ర భారాన్ని మోపుతుందంటూ ప్రత్యర్థి పార్టీలు ఎన్డీయే కూటమి పై మండిపడుతున్నారు.

ADVERTISEMENT

గడిచిన 10 రోజులల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి నాలుగుసార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ ప్రజల పై భారం మోపింది. పెంచిన ధరల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19, డీజిల్ ధర రూ. 104.88 కి చేరింది.

దీనితో దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు నమోదయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.ఈ భారం ప్రజలను కూటమి కి దూరం చేసే ప్రమాదం ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అధిక ఇంధన ధరలు ఉండడం ప్రజలలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనాన్ని సృష్టిస్తుంది.

ప్రత్యక్షంగా ఒక్క ఇంధన ధరల పెంపు పరోక్షంగా అనేక వస్తువుల ధరలను ప్రభావితం చేస్తుంది. ప్రజల నిత్యావసరాల నుంచి కూరాగాయాలు, పాలు…ఇలా రవాణా మీద ఆధారపడే ఎన్నో వస్తువుల ధరలకు కూడా రెక్కలొస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన ఈ ఇంధన సంక్షోభం ఎప్పటికి ముగింపు దశకు వస్తుందో చెప్పలేం కానీ ఈ లోపు దానితాలూకా ఫలితాలు మాత్రం దేశంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అనుభవించాల్సిందే.

కూటమి ఇప్పటికైనా ఇంధన ధరల విషయంలో పొరుగు రాష్ట్రాలతో సరిసమానంగా పెట్రోల్, డీజిల్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తే కొంతవరకు ప్రజావ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. మరి ఆ దిశగా బాబు సర్కార్ చర్యలకు ఉపక్రమిస్తుందా.?

ఇక ఒకపక్క దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలవడంతో కూటమి సర్కార్ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తుంటే మరోపక్క అప్రకటిత పవర్ కట్స్ ప్రజల సహనాన్ని పరీక్షిస్తుందనే చెప్పాలి. మంగళగిరి నారా లోకేష్ నియోజకవర్గంలో తాడేపల్లి ప్రాంతంలో ప్రజలు అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారు.

ఒకపక్క బాణుడు భగభగలు వేడి మంటలు పుట్టిస్తుంటే మరోపక్క ప్రజలకు ఈ కరెంట్ కష్టాలు మరింత ఉక్కపోతకు గురి చేస్తున్నాయి. ఉదయం, మధ్యాహనం, రాత్రి అనే తేడా లేకుండా రోజులో గంటల తరబడి విద్యుత్ కోతలు ప్రజలకు ప్రభుత్వం పై ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

ఒకపక్క ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి, వాటి ఫలితంగా ప్రజల కరెంట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఓవర్ లోడ్ ప్రభావంతోనే ఇటువంటి అప్రకటిత పవర్ కట్స్ అంటూ అధికారులు వివరణ ఇస్తున్నా అది ప్రజలను శాంతిపచేయలేవు.

క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, వారి ఆవేదనను అర్ధం చేసుకోకుండా, వారి ఆగ్రహాన్ని గుర్తించకుండా ప్రభుత్వాలు గుడ్డిగా తమ వాదనతోనే ముందుకెళితే మాత్రం రాజకీయంగా కూటమి కూడా వైసీపీ మాదిరే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories