జగన్ అరాచకానికి, వైసీపీ నిరంకుశత్వానికి కాదేది అనర్హం అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి నట్టేట మునిగారు. ఏపీలో సంచలనం రేపిన నటి జిత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కున్న ముగ్గురు IPS లు కాంతిరాణా టాటా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నా లపై మరో 6 నెలలు సస్పెన్షన్ వేటు పొడగింపుకు ఆదేశాలిచ్చింది ఏపీ ప్రభుత్వం.
వైసీపీ నేతల రాజకీయ ప్రలోభాలకు లొంగి జిత్వాని కేసులో చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన ఈ ముగ్గురు IPS లు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉన్నతాధికారులుగా, ప్రజా సేవకులుగా ఉంటూ ఒక పార్టీ కోసం, ఆ ప్రభుత్వ పెద్దల కోసం వీరు చేసిన అరాచకాలకు సస్పెన్షన్ తో సరిపెట్టడం ఏంటి, అరెస్టులు చెయ్యరా అంటూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
జిత్వానిని అనధికారికంగా ఢిల్లీ నుంచి ఏపీకి తరలించడం దగ్గర నుంచి ఆమెను, ఆమె కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా హింసించి, దాదాపు మూడు నెలల పాటు నిర్బంధించిన ఈ ముగ్గురు వారి IPS పదవికి కళంకం తెచ్చారనే చెప్పాలి. జగన్ అండ చూసుకుని గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన వారిలో కాంతిరాణా టాటా, సీతారామాంజనేయుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఈ ముగ్గురు IPS లు నిబంధనలను ఉల్లగించారంటూ రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫారస్ మేరకు సెప్టెంబర్ 25 వరకు వీరి సస్పెన్షన్ కొనసాగుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. అయితే నాడు వైసీపీ ప్రభుత్వం కోసం తలవంచిన పాపానికి నేడు కూటమి ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు తలెత్తలేని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు ఈ ముగ్గురు IPS లు.
ఒక ప్రభుత్వాన్ని నమ్మి, ఒక నాయకుడి అడుగులకు మడుగులొత్తితే దాని ఫలితం ఎలా ఉంటుందో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ నిర్ణయాలతో బలైన ఐఏఎస్ శ్రీలక్ష్మి, మరికొంతమంది అధికారులను చూసిన తరువాత కూడా ఈ ముగ్గురు తమ పరిధి దాటి ముందుకెళ్లారు అంటే అది వారి బరితెగింపనాలా.? లేక వ్యవస్థల పని తీరు మీద వారికున్న నిర్లక్ష్యమనాలా.?




