ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపండి బాబూ

Andhra Pradesh Formation Day

ప్రభుత్వాలు మారినంత మాత్రన్న స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు మారిపోవు.

ఇదివరకు ఆంధ్రా, తెలంగాణ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏటా నవంబర్‌ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేవారు.

ADVERTISEMENT

కానీ 2014, జూలై 2వ తేదీన రెండుగా విడిపోయినప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్దత ఏర్పడింది.

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వలననే మద్రాస్ రెసిడెన్సీ నుంచి విడదీసి 1953, అక్టోబర్‌ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు చేశారు.

కానీ మూడేళ్ళ తర్వాత తెలుగు మాట్లాడే తెలంగాణని కూడా కలిపి హైదరాబాద్‌ రాజధానిగా 1956, నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేశారు.

అప్పటి నుంచి రాష్ట్ర విభజన వరకు నవంబర్‌ 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

కానీ రాష్ట్ర విభజన తర్వాత జూలై 2వ తేదీన జరుపుకోవాలా లేదా ఎప్పటిలాగే నవంబర్‌ 1వ తేదీన జరుపుకోవాలా లేదా ఈ రెండు కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున అంటే (1952) డిసెంబర్‌ 15వ తేదీన జరుపుకోవాలా అనే చర్చలు సాగాయి.

కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, జూలై 2 నుంచి వారం రోజుల పాటు ‘నవనిర్మాణ దీక్ష’గా జరుపుకుందామని ప్రతిపాదించి అలాగే చేశారు.

కానీ ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మళ్ళీ నవంబర్‌ 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి పాటిస్తున్నారు. ఈ సందిగ్ధం, రాజకీయాలు కారణంగా ఒకప్పుడు అంగరంగ వైభవంగా, ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రజలు కూడా విస్మరించారని చెప్పక తప్పదు.

అయితే వైసీపి నవంబర్‌ 1కే కట్టుబడి ఉంది కనుక నేడు జగన్‌, వైసీపి నేతలు నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం, చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయనని విస్మరించినందుకు సిఎం చంద్రబాబు నాయుడుని, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ని, టిడిపి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరపకపోవడాన్ని వైసీపి నేతలు తప్పు పట్టారు.

వైసీపి నేతలు విమర్శించారని కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం మేధావులతో చర్చించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఏర్పడిన ఈ సందిగ్దతని తొలగించి, మళ్ళీ ఎప్పటిలాగే ఏటా ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ప్రజలకు కూడా గౌరవంగా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories