వైసీపీ ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టినా దాని వెనుక ఏదో పెద్ద తంత్రం తప్పక ఉంటుంది. అది మూడు రాజధానులు కావచ్చు…వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు… లేదా అమరావతిలో సెంటు భూములు పంచిపెట్టడం కావచ్చు. వాటితో రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో కాక రాజకీయ వ్యూహాలుగా అమలుచేస్తుండటం వలన జగన్ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయన్ని చెపొచ్చు.
మూడు రాజధానులకు హైకోర్టు, సుప్రీంకోర్టు బ్రేకులు వేయగా, అమరావతిలో సెంటు భూములలో ఇళ్ళ నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది.
రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములలో ఆర్-5 జోన్ సృష్టించి దానిలో 1,402 ఎకరాలలో ఒక్కొక్కరికీ ఓ సెంటు చొప్పున 50,793 మందికి జగన్ ప్రభుత్వం పట్టాలు పంచిపెట్టింది. రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తునప్పటికీ ఇటీవలే సిఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇళ్ళ నిర్మాణాలకి శంకుస్థాపన కూడా చేశారు.
వీటి కోసం ప్రభుత్వం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఇచ్చిన జీవోలపై, ఇళ్ళ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజధాని గ్రామాల రైతులు, రాయపూడి దళిత భజన సంక్షేమ ఐకాస హైకోర్టులో పిటిషన్లు వేషారు.
జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్ర రాయ్, జసిస్ట్ రవినాధ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాటిపై విచారణ చేపట్టి స్టే విదిస్తున్నట్లు నేడు తీర్పు చెప్పారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ ప్రభుత్వం అమరావతిని కాదన్నందుకు రాజధాని ప్రాంతాలలో వైసీపీకి ఓట్లు పడవు. కనుక అక్కడ కొత్తగా ఓటు బ్యాంక్ సృష్టించుకొనేందుకే సెంటు భూములు పంచిపెడుతోందని రాజధాని రైతులు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులో రాజధాని వివాదం ఉన్నప్పుడు ఆ వివాదాస్పద భూములను పేద ప్రజలకు పంచడమే తప్పని, మళ్ళీ వాటిలో ఇళ్ళు నిర్మించడం ఇంకా తప్పని, చివరికి వాటిని తీసుకొన్న లబ్ధిదారులే నష్టపోతారని రాజధాని రైతులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమయ్యింది.
చేసే పనిలో చిత్తశుద్ధి లేనప్పుడు దానికి ఇటువంటి ఫలితాలే వస్తుంటాయి. కానీ తమకు చిత్తశుద్ధి లేదనే విషయం చెప్పుకోలేక పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకొంటున్నారని, రాజధానిలో పేదలు ఉండకూడదని కుట్రలు పన్నుతున్నారని జగన్ వితండవాదం చేస్తున్నారు.
నిజానికి ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా పేదలు లేని రాజధానులు ఉండవనే సంగతి జగన్ ప్రభుత్వానికి తెలియదా?దేశ రాజధాని ఢిల్లీలో లేరా… దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో లేరా హైదరాబాద్‌లో లేరా?కాబోయే రాజధాని అని జగన్ ప్రభుత్వం చెప్పుకొంటున్న విశాఖలో లేరా? కనుక అమరావతిలో పేదలు ఉండకూడదని చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారనే సిఎం జగన్ వాదన అర్దరహితమే కదా?అయినా ఓ రాజకీయ దురాలోచనతో అమరావతిలో సెంటు భూములు పంచిపెట్టి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలను నిందించడం విడ్డూరంగా ఉంది కదా?



