ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే. మొదట ఉమ్మడి జిల్లాల పరిధి వరకే దీనిని పరిమితం చేయాలనుకున్నప్పటికీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు.
దీని ఏర్పాట్లని పర్యవేక్షించి అధికారులకు మార్గదర్శనం చేసేందుకు ఆయన అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నారు. బుధవారం గుంటూరులో అధికారులతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ పధకం గురించి మరికొన్ని వివరాలు తెలియజేశారు.
“కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ గుర్తింపు కార్డు అయినా చూపించి మహిళలు అన్ని రకాల బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు విధించడం లేదు.
త్వరలో మరో 1,050 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయి. అంత వరకు ఉన్న బస్సులనే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించాము,” అని చెప్పారు.
ఏపీఎస్ ఆర్టీసీ ‘స్త్రీ శక్తి’ పేరుతో ముద్రించిన ఓ బస్ టికెట్ ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. విజయవాడ డిపోకి చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు (నంబర్: ఏపీ 16Z 0368)లో ప్రయాణం కొరకు జారీ చేసిన టికెట్ కాపీలో టికెట్ ధర రూ.120, ప్రభుత్వ రాయితీ రూ.120, చెల్లించాల్సిన మొత్తం రూ.0 అని ఉంది. బహుశః జీరో టికెట్ ప్రక్రియ ఏవిదంగా ఉండాలో ఆర్టీసీ అధికారులు పరీక్ష కోసం తీసిన ప్రింట్ ఇది అయ్యుండవచ్చు. కనుక ఆగస్ట్ 15న రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లే అని ననదమూరి బాలకృష్ణ భార్య వసుందరా దేవి అన్న మాట నిజమే అనుకోవచ్చు.






