జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు ఎవరికీ అంతుపట్టని బ్రహ్మపదార్ధంగా కనిపిస్తోంది. దాని విచారణ కొనసాగుతున్న కొద్దీ రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఈ కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బు పట్టుబడకుండా ఉండేందుకు బంగారం కొనుగోలు చేశారని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో భారీగా పెట్టుబడులు పెట్టారని సిట్ అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ కుంభకోణంలో సుమారు రూ.3,500 కోట్లు పైగా అవినీతి జరిగిందని కూడా చెప్పింది. కనుక సిట్ విచారణలో బయటపడిన వివరాల ఆధారంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు నేడు హైదరాబాద్‌లో డీఎస్ఆర్ గ్రూప్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి. సుధాకర్ రెడ్డి, సీఈవో సత్యనారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.ప్రభాకర్ రెడ్డి, సంస్థలో భాగస్వామిగా ఉన్న వెంకట కృష్ణారెడ్డిల ఇళ్ళు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, చెన్నై, నెల్లూరు, బెంగళూరులో ఉన్న డీఎస్ఆర్ గ్రూప్ కార్యాలయాలపై కూడా నేడు సోదాలు జరుగుతున్నాయి.
మద్యం కుంభకోణం కేసులో నిందితులలో ఒకరైన రాజ్ కసిరెడ్డికి డీఎస్ఆర్ గ్రూప్‌కి సంబంధాలు ఉన్నాయని, రాజ్ కసిరెడ్డి ఈ సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో వందల కోట్లు పెట్టుబడులు పెట్టారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఐటి అధికారులు కూడా రంగంలో దిగి సోదాలు నిర్వహిస్తుండటంతో ఈ కేసుకి సంబంధించి మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.
ఏదో అవినీతి చేసి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ఇంట్లో దాచుకున్నప్పుడు పట్టుబడినా పట్టుకొని నేర నిరూపణ చేయడం చాలా కష్టం. అలాంటిది బంగారం కొనుగోలు, రియల్ ఎస్టేట్ కంపెనీలో పార్టనర్ షిప్, పెట్టుబడులు, వ్యాపారాల లావాదేవీలతో ముడిపడి ఉంటే నేర నిరూపణ ఇంకా కష్టంగా మారుతుంది.
కనుక ఏపీ మద్యం కుంభకోణం కేసుని ఎప్పటికైనా చేధించగలరా?ఒకవేళ చేధించినా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అలియాస్ అంతిమ లబ్దిదారుతో సహా అందరికీ శిక్షలు పడేలా చేయగలదా?దోచుకున్న సొమ్ము అంతా కక్కించగలదా?అంటే అనుమానమే!
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు కళ్ళెదుటే తిరుగుతున్నా అరెస్ట్ చేయలేనప్పుడు, ఇంత సంక్లిష్టమైన కేసులో దోషులకు శిక్షలు పడటం దాదాపు అసంభవమే కదా?






