మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించిన వారందరినీ సిట్ అధికారులు ఒకరొకరిగా అరెస్టు చేస్తూనే ఉన్నారు.
ఈ వ్యవహారంలో ముడుపులు కలక్షన్ ఏజంటుగా వ్యవహరించినట్లు భావిస్తున్న వరుణ్ పురుషోత్తం (ఏ-40) మంగళవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం అందుకున్న సిట్ అధికారులు, హైదరాబాద్ చేరుకొని శంషాబాద్ విమానాశ్రంలో అతనిని అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు.
అతను ఇచ్చిన సమాచారంతో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి శివారులో ఉన్న ఓ ఫామ్‌హౌసు నుంచి రూ.11 కోట్లు నగదు స్వాధీనం చేసుకుని విజయవాడ తరలించారు.
ఈ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అన్ని అయిన రాజ్ కసిరెడ్డి బ్యాచ్‌లో వరుణ్ పురుషోత్తం కూడా ఒకరు. అతను రాజ్ కసిరెడ్డి ఆదేశం మేరకు మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని వస్తుండేవాడని సిట్ ఆభియోగ పత్రంలో పేర్కొంది.
అసలు మద్యం కుంభకోణమే జరుగలేదని, ఇదంతా కూటమి ప్రభుత్వం, పోలీసులు కలిసి సృష్టించిన భూటకపు కేసు మాత్రమే అని జగన్, వైసీపీ నేతలు ఇంతకాలం వాదిస్తున్నారు. కానీ ఇప్పుడు కలక్షన్ ఏజంటుగా వ్యవహరించిన వరుణ్ పురుషోత్తం అరెస్ట్ చేయడమే కాకుండా, అతను చెప్పిన ఫామ్‌హౌసులో రూ.11 కోట్లు నగదు కూడా స్వాధీనం లభించింది.
కనుక నేడు లభించిన ఈ నగదే మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవమని ద్రువీకరిస్తున్నట్లు అయ్యింది. దీంతో ఈ కేసు విచారణకు మరింత బలమైన సాక్ష్యాధారాలు లభించినట్లయింది కూడా.
కనుక ఇక ఈ మద్యం కుంభకోణం సూత్రధారి, అంతిమ లబ్దిదారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే సిట్ అధికారులు అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనతోనే జగన్ కూటమి ప్రభుత్వంపై మరింత తీవ్ర స్థాయిలో ఎదురుదాడులకు పాల్పడుతున్నారేమో? రేపు నెల్లూరు పర్యటనలో వైసీపీ చేయబోయే ఓవర్ యాక్షన్, జగన్ చేసే ప్రసంగమే ఆయన ఆందోళనకు అద్దం పట్టవచ్చు.






