ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ-4గా ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా ఆయన చేతుల మీదుగానే నడిచేది. కనుక ఈ కేసులో ఆయన చాలా కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు.
మిథున్ రెడ్డి ఇదివరకే ముందస్తు బెయిల్ కోసం నేరుగా సుప్రీం కోర్టుని ఆశ్రయించగా, వెళ్ళి హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పి పంపేసింది. కానీ హైకోర్టు చెప్పేవరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పేసింది కనుక మిథున్ రెడ్డి మళ్ళీ సుప్రీం కోర్టుని ఆశ్రయించవచ్చు. అప్పుడు సుప్రీం కోర్టు విచారణ జరుపవచ్చు. ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కనుక మిథున్ రెడ్డికి ఇక నుంచి ప్రతీరోజూ చాలా విలువైనదే. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సివస్తుంది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకి వెళితే ఆ కేసులో సూత్రధారుల పేర్లు బయట పెట్టేస్తారని, అందుకే ఆయనని జైలుకి వెళ్ళకుండా జగన్ కాపాడుకొస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డి, జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా అదే చెపుతున్నారు.
ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కేసులో ఆర్ధిక లావాదేవీలన్నీ మిథున్ రెడ్డే చూసేవారని సిట్ అధికారులు చెపుతున్నారు. కనుక ఇప్పుడు ఆయన అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కూడా జగన్‌కు చాలా ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి లేరు. కనుక ఒకవేళ ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాల్సివస్తే స్వామిభక్తి ప్రదర్శించి మద్యం కుంభకోణం కేసు తన నెత్తి మీద వేసుకుంటారా లేదా ‘ఫైనల్ బెనిఫిషరీ’ పేరు చెప్పేసి ఈ కేసు నుంచి బయటపడతారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.




