వర్మకి నోటీస్… అయితే విడిచిపెట్టలేదన్నమాట!

AP Police RGV Ram Gopal Varma

మహాభారతంలో దుర్యోధనుడుని నమ్ముకున్నవారు, పక్కనే ఉంటూ ముంచేసినవారు అందరూ కలిసి కురుక్షేత్ర యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారు. అదేవిదంగా ఏపీలో జగన్‌, ఆయనని నమ్ముకున్నవారు కూడా ఎన్నికల కురుక్షేత్రంలో ఓడిపోయారు.

ADVERTISEMENT

కొందరు ఆయనకు శల్యసారధ్యం చేస్తుంటే, ఆయన పార్టీకి, ప్రజలకి శల్యసారధ్యం చేస్తూ చేజేతులా తనని తానే ఓడించుకున్నారు. కురుక్షేత్ర యుద్ధంతో కౌరవులు అందరూ పోయారు. దాంతోనే కురు, పాండవుల ఆస్తి పంపకాల గొడవలు అన్నీ సమసిపోయాయి.

కానీ ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో దుర్యోధనపాత్ర చేస్తూ అర్జునుడిని, కర్ణుడిని, శ్రీకృష్ణుడిననే భ్రమలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన జగన్‌, ఆయనకు శల్యసారధ్యం చేసినవారు అందరూ మాత్రం నేటికీ ఇంకా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఆస్తి పంపకాల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.

జగన్‌ ప్రోత్సాహంతో పేట్రేగిపోయినవారి జాబితా చాలా పెద్దదే ఉంది. ఆ జాబితాలో దర్శకుడు రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు.

ఏపీలో వైసీపి అధికారం వచ్చినప్పటి నుంచే వైసీపి ఆస్థాన దర్శకుడు, విమర్శకుడుగా రాంగోపాల్ వర్మ వ్యవహరించడం మొదలుపెట్టారు. ట్విట్టర్‌, తన సినిమాలలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లతో ఆడుకుంటూనే ఉన్నారు.

కానీ ఎన్నికలలో వైసీపి ఓడిపోగానే స్పృహలోకి వచ్చిన రాంగోపాల్ వర్మ, “ఇకపై చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ జోలికి వెళ్ళను. ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయను,” అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి అలవాటు లేకపోయినా ఇంతకాలం ఆ మాటకి కట్టుబడి ఉండిపోయారు.

ఇంతకాలంగా టిడిపి, జనసేన నేతలు ఎవరూ ఆయన జోలికి వెళ్ళకపోవడంతో కూటమి ప్రభుత్వం ఆయనని క్షమించి విడిచిపెట్టేసిందనే అందరూ అనుకున్నారు.

కానీ వైసీపి జాబితాలో ఆయన నంబర్‌ వచ్చేసరికి కాస్త ఆలస్యం అయ్యిందే తప్ప విడిచిపెట్టేయలేదని స్పష్టం చేస్తూ, ఒంగోలు పోలీసులు ఆయనకు నోటీస్‌ ఇచ్చేందుకు నేడు హైదరాబాద్‌ వెళ్ళారు.

శాసనసభ ఎన్నికలలో టిడిపిని చావు దెబ్బ తీసేందుకు వైసీపి ప్రొడక్షన్‌లో రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తదితరులు జగన్‌ని దెబ్బ తీసేందుకు కుట్రలు చేసిన్నట్లు చూపారు.

ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వారిని, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు.

కనుక ఇప్పుడు ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు నమోదైంది. ఆ కేసులో విచారణకు హాజరుకావాలంటూ రాంగోపాల్ వర్మకి నోటీస్‌ ఇచ్చేందుకు ఏపీ పోలీసులు బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. కనుక ఇప్పటికి వర్మకి ముహూర్తం పెట్టారన్న మాట!

వైసీపిలో రెచ్చిపోయినవారందరి పరిస్థితి ఏమవుతోందో కళ్ళారా చూస్తున్నా పాపం మన రాజా… అదే పోసాని కృష్ణ మురళి మళ్ళీ మొదలుపెట్టేశారు. అంటే తన సంగతి పోలీసులు మరిచిపోయారనుకున్నారో ఏమో? పోలీసులు పోసానిని పలకరించడానికి కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఆయన మళ్ళీ మొదలుపెట్టాక రాకుండా ఉంటారా?పలకరించకుండా వదిలేస్తారా?

ADVERTISEMENT
Latest Stories