స్త్రీశక్తికి వైసీపీ సన్నాయిమేళం… అవసరమా?

AP Stree Shakti Scheme Benefits Women

ఆగస్ట్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్త్రీశక్తి పధకం ప్రారంభం అయ్యింది. కానీ దాని కంటే ముందు వైసీపీ సన్నాయి మేళం మొదలైంది.

ఏ బస్సులోనైనా ఫ్రీ అని చెప్పి కొన్ని బస్సులకే పరిమితం చేశారని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ప్రయాణం అని చెప్పి ఈ ఆంక్షలతో బస్సులు మారితే తప్ప ప్రయాణించలేని పరిస్థితి కల్పించిందని వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

ADVERTISEMENT

నిజానికి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు టీడీపి, జనసేనలు సైతం వాటిని అమలు చేయడం కష్టమని భావించాయి. కనుక జగన్‌ కూడా అదే అనుకుని పాట మొదలుపెట్టేశారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఒకటొకటిగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నారు.

సంక్షేమ పధకాలపై సర్వ హక్కులు తనకు మాత్రమే ఉన్నాయనే గుడ్డి భ్రమలో జగన్‌ ఉండటం, వాటిని తాను తప్ప మరెవరూ అమలు చేయరనుకోవడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రజాకర్షక పనులపై ఆసక్తి చూపారనే చిన్న ఆశ వలననే జగన్‌ ఇవన్నీ జీర్ణించుకోవడం కష్టమవుతోందని చెప్పవచ్చు.

ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొట్టేస్తున్నారు… వీటితో వైసీపీ ఓటు బ్యాంకు తారుమారు అవుతుంది. కనుక కోడిగుడ్డుకి ఈకలు పీకక తప్పడం లేదు.

కానీ స్త్రీశక్తితో జగన్‌ ఇలాగే ఆటలాడుకుంటే ఏదో రోజు వాళ్ళే బుద్ధి చెపుతారు. ఎందువల్ల అంటే, స్త్రీశక్తి ద్వారా మహిళలపై ఆర్ధిక భారం కాస్త తగ్గించేందుకే తప్ప విలాసయాత్రలు చేయడానికి కాదు. ఈ విషయం మహిళలకు అర్దమైంది కానీ వైసీపీ సన్నాయి మేళానికి ఇంకా అర్ధం కాలేదు.

ఉదాహరణకు రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పెద్ద పట్టణాలలో, వాటి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న మహిళలు, విద్యార్ధినులు చదువులు, ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు, రోజువారి కూలిపనులు చేసుకునేందుకు రోజూ బస్సులలో ప్రయాణిస్తుంటారు. వారందరికీ స్త్రీశక్తి పధకంతో చాలా ఉపశమనం లభిస్తుంది. కనుక వారందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్త్రీశక్తి పధకం ఉపయోగించుకొని మహిళలు తీర్ధయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. ఉదాహరణకు శ్రీకాకుళంలో నివసిస్తున్న మహిళలు విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. డైరెక్ట్ బస్సులు చాలానే ఉన్నాయి ఒకవేళ వాటిలో సీట్లు లభించకపోతే టికెట్ కొనవలసిన అవసరం లేదు కనుక రెండు బస్సులు మారవచ్చు.

రైలుతో పోలిస్తే బస్సు ప్రయాణం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకు సిద్దపడి బస్సు ఎక్కుతున్నప్పుడు రెండు బస్సులు మారడం పెద్ద కష్టమేమీ కాదు.

స్త్రీశక్తి పధకంపై వైసీపీ ఇంకా విమర్శలు కొనసాగిస్తే దీని వలన లబ్ది పొందుతున్న మహిళలు అసహ్యించుకుంటారు. వైసీపీకి దూరం అవుతారని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories