అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల ప్రాజెక్టుకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి రాష్ట్రానికి అన్యాయం చేసేశారని వితండవాదం చేస్తుంటే, ఇక్కడ ఏపీలో వైసీపీ బనకచర్ల సాధించుకోస్తామని ధిల్లీ వెళ్ళి చేతులేత్తేశారని ఏడ్పులు ఏడుస్తూనే ఉంది.
జగన్ మనసాక్షి మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని కనిపెట్టి చెప్పేసింది.
సాక్షి చెప్పినట్లు నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యుంటే బనకచర్ల ప్రాజెక్టుకి రేవంత్ రెడ్డి మోకాలు అడ్డేవారు కారు కదా? పైగా రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం నిలిపేసి తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించమని అడిగేవారు కారు కదా?
అయినా కేసీఆర్, జగన్ మద్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగబట్టే 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు…. వారిద్దరి మద్య సత్సంబంధాలు ఉన్నందునే 2024 ఎన్నికలలో కూడా జగన్ గెలవాలని, గెలుస్తారని కేసీఆర్ చిలక జోస్యం కూడా చెప్పారు కదా?
చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు జగన్ చేతిలో పెడితే 5 ఏళ్ళలో వాటిని పూర్తిచేయలేక చేతులెత్తేసి కుంటిసాకులు చెప్పి కాలక్షేపం చేసి దిగిపోయారు. వాటినే ఎలా పూర్తి చేయలో తెలీని జగన్‌కి బనకచర్ల వంటి కొత్త ఆలోచన కలుగుతుందని అనుకోలేము.
కానీ బనకచర్ల ప్రాజెక్టు సాంకేతిక అంశాల గురించి లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ కోణంలో విమర్శలు చేయవచ్చు, కనుకనే దానిపై తమ నేతల చేత, మీడియా చేత నోటికి వచ్చినదేదో మాట్లాడిస్తూ, వ్రాయిస్తూ సిఎం చంద్రబాబు నాయుడుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు.
ఏపీని 5 ఏళ్ళు పాలించినా అభివృద్ధి చేయలేకపోయిన జగన్, ‘రప్పా రప్పా’ అంటూ ఏపీ అభివృద్ధికి అడ్డుపడాలనుకుంటే ప్రజలు క్షమిస్తారా?కేవలం 10 మంది ఎమ్మెల్యేలున్న జగన్‌కే వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని నమ్మకం ఉంటే, పదవి, అధికారం, 165మంది ఎమ్మెల్యేలున్న చంద్రబాబు నాయుడుకి మరికెంత ఉండాలి?
జగన్ ప్రతిపక్షంలో ఉంటూ కూడా రాజకీయాలను ఈ స్థాయికి దిగజార్చినందుకు, ఒకవేళ మరోసారి వైసీపీ ఓడిపోతే తన పరిస్థితి, పార్టీ నేతల పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే మంచిదేమో?




