ఆర్టీసీ బస్సులు సామాన్యుల ప్రయాణ సాధనాలు కానీ వాటిలో వారు ప్రయాణించలేని పరిస్థితి కల్పిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. రెండున్నర నెలల క్రితం డీజిల్ సెస్ పేరుతో టికెట్ ఛార్జీల ధరలను భారీగా పెంచేసిన ఏపీఎస్ ఆర్టీసీ, మళ్ళీ నేటి నుంచి డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఛార్జీలు పెంచింది. డీజిల్ ధరలు పెరగడంతో ఏపీఎస్ ఆర్టీసీపై రోజుకి రూ.2.5 కోట్లు అదనపు భారం పడుతోంది కనుక టికెట్ ఛార్జీలు పెంచక తప్పడం లేదని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు. దీంతో ప్రయాణికులపై సుమారు రూ.500 కోట్లు అదనపు భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాలను సమీపంలోని పట్టణాలతో అనుసంధానించే పల్లె వెలుగు సర్వీసులపై, నిరుపేద, మద్యతరగతి విద్యార్దుల బస్సు పాసులకు కూడా డీజిల్ సెస్ నుంచి మినహాయింపు ఇవ్వకుండా భారీగా పెంచేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే తిరుమల కొండపైకి వెళ్ళేందుకు తిరుపతి-తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్ బస్సులను కూడా విడిచిపెట్టలేదు.
పల్లెవెలుగు సర్వీసులలో మొదటి 30 కిమీలను మినహాయించి ఆపైన 35-60 కిమీ దూరానికి రూ.5, 65-70 కిమీ దూరానికి రూ.10, 70-95కిమీ దొరానికి రూ.15, 100-120 కిమీ దూరానికి కిమీకు రూ.20 చొప్పున పెంచేసింది. అదేవిదంగా మిగిలిన అన్ని రకాల సర్వీసులపై కూడా దూరం పెరుగుతున్న కొద్దీ ప్రయాణికులపై భారం పెంచేసింది.
అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన పేరుతో పేద విద్యార్దులు కఃదువుకొనేందుకు సాయపడుతున్నామని గొప్పగా చెప్పుకొంటూ, విద్యార్దుల బస్ పాసుల ఛార్జీలు ఒకేసారి రెట్టింపు చేయడం దారుణం.
నగరాలలో విద్యార్దుల జనరల్ బస్ పాసులు నెలకు రూ.155 ఉండగా దానిని ఒకేసారి రూ.300కి, స్పెషల్ పాసులను రూ.245 నుంచి రూ.350కి పెంచేసింది.
జనరల్ బస్ పాసులు తీసుకొనే స్థోమత లేనివారు తాము నిత్యం ప్రయాణించే మార్గంలో రూట్ బస్ పాసులు తీసుకొంటారు. ఏపీఎస్ ఆర్టీసీ వాటిని కూడా భారీగా పెంచేయడం చాలా దారుణం. నెలవారి 4కిమీ దూరానికి రూ.55ని రూ.120కి, కిమీకి రూ.65ని 150కి, 22కిమీకి రూ.105 నుంచి ఏకంగా రూ.270కి ఏపీఎస్ ఆర్టీసీ పెంచేయడంతో ఆ విద్యార్దులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్దులను కూడా విడిచిఓపెట్టకుండా వారిపై కూడా ఈ అదనపు భారం మోపింది. గ్రామీణ ప్రాంతాలలో బస్ పాసులకు నిన్నటి వరకు 5 కిమీ వరకు నెలకు రూ.100 ఉండగా దానిని రూ.140కి పెంచేసింది. అదేవిదంగా 10కిమీకు రూ.125 ఉండగా దానిని రూ.190కి, 15కిమీలకు రూ.160 ఉండగా దానిని రూ.240కి, 20కిమీలకు రూ.210 ఉండగా దానిని రూ.315కి, 50కిమీలకు రూ.490 ఉండగా దానిని రూ.735కి పెంచేసింది.
ఇవికాక అన్ని రకాల సర్వీసులలో డీజిల్ సెస్ పేరుతో టికెట్ ఛార్జీలు భారీగా పెంచేయడంతో సామాన్య, మద్యతరగతి ప్రజలపై పెనుభారం మోపింది. ప్రభుత్వోద్యోగులకు మూడు డీఏ బకాయిలు చెల్లించేశామని చెపుతూ, వారి జీపీఎఫ్ ఖాతాలలో నుంచి వారికి తెలియకుండా డబ్బు వెనక్కు తీసుకొన్నట్లే, ఓ వైపు సంక్షేమ పధకాలు ఇస్తూ వాటి కోసం ఈవిదంగా ఏదో ఓ సాకుతో మళ్ళీ వసూలు చేసుకొంతున్నట్లుంది.



