విపక్ష కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ… ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో లింకులను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులకు షాకిచ్చే విషయాలు వెలుగుచూశాయి. బీజేపీ మిత్రపక్షం టీడీపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతోనూ సంజయ్ భండారీ భేటీ అయ్యారన్న వాస్తవాలు కలకలం రేపుతున్నాయి.
సంజయ్ భండారీ నుంచి లండన్ లో ఓ ఇంటిని రాబర్ట్ వాద్రా బహుమానంగా అందుకున్నారన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు అధికారులు భండారీ నివాసంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న అప్పారావుతో భండారీకి లింకులున్నట్లు బయటపడింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా… అశోక్ గజపతిరాజుతోనూ భండారీ భేటీ అయినట్లు తేలింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఓఎస్డీ అప్పారావే ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అశోక్ ను కలిసేందుకు ఢిల్లీలోని అధికారిక నివాసానికి భండారీ వచ్చారని, గడచిన ఏడాదిన్నరలో మూడు, నాలుగు సార్లు అశోక్ గజపతిరాజుతో భండారీ భేటీ అయినట్లు అప్పారావు తెలిపారు. విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్న కారణంగానే భండారీ… మంత్రితో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్ షో సందర్భంగానూ మంత్రిని భండారీ కలిశారని తెలిపారు. సదరు సమాచారం అంతా జాతీయ మీడియాలో కలకలం రేపుతున్నాయి.



