కేంద్రానికి ఉన్న ఆసక్తి, చిత్తశుద్ధి జగన్‌ ప్రభుత్వానికి లేదే!

Railway-Minister-Ashwini-Vaishnaw

ఈరోజు పార్లమెంట్‌ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారలోకి వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది.

ADVERTISEMENT

బడ్జెట్‌లో ఏపీకి సంబందించి, రైల్వే స్టేషన్స్, రైల్వే లైన్ల అభివృద్ధి కోసం రూ.9,138 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 240 కిమీ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 98 శాతం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, దీనికి సంబందించి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా సిద్దమైందని చెప్పారు. కానీ జోన్ ఏర్పాటుకు కావలసిన 53 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన ఆలస్యమవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే వెంటనే పనులు మొదలుపెట్టడానికి రైల్వేశాఖ సిద్దంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

ఏపీతో పోలిస్తే తెలంగాణలో రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో రైల్వేలపై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకి సిద్దంగా ఉంటే జగన్‌ ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటం వలన రైల్వే జోన్ చేజారి పోయే ప్రమాదం పొంచి ఉంది. అంటే రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్నపాటి శ్రద్ద కూడా జగన్‌ ప్రభుత్వానికి లేదని అర్దమవుతూనే ఉంది.

విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ తీవ్రంగా నష్టపోతుందని చెపుతూ, ఇదివరకు ఒడిశా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అడ్డు పుల్ల వేసేందుకు చాలా ప్రయత్నించింది.

ఈ ఒత్తిళ్ళ కారణంగా విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన అటకెక్కిపోయింది కూడా. ఈ విషయం జగన్‌ ప్రభుత్వానికి తెలుసు.

కానీ జగన్‌ ప్రభుత్వం దృష్టి ఎల్లప్పుడూ సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులుపైనే ఉంటోంది. జగన్‌ ప్రభుత్వ అలసత్వానికి విశాఖ రైల్వే జోన్ చేజారిపోతే మళ్ళీ కధ మొదటికొస్తుంది. అదే జరిగితే జగన్‌ ప్రభుత్వం అలసత్వానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories