ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. శనివారం ఉదయం వైవీ సుబ్బారెడ్డితో కలిసి వచ్చి తనను కలవవలసిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన్నట్లు తెలుస్తోంది.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర బంధువులే కావడంతో ఇటీవల వైఎస్ విజయమ్మ ఒంగోలు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డితో తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీని వీడక తప్పదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి విజయమ్మకు చెప్పిన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి కూడా ఆయన ప్రస్తావించి, ఈ కుంభకోణాన్ని తన మెడకు చుట్టేందుకు పార్టీలో కొందరు ప్రయత్నిస్తున్నారని, అప్పుడు తాను అసలు సూత్రధారుల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే అధిష్టానం ఎటువంటి చర్య తీసుకోలేదని విజయమ్మకు మొర పెట్టుకొన్నట్లు సమాచారం. అయితే ఆమె కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపికి దూరమై చాలా కాలమే అయినందున తాను కూడా ఏమీ చేయలేనని చెప్పిన్నట్లు సమాచారం.
విజయమ్మ-బాలినేని భేటీ అయిన్నట్లు జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో రేపు శనివారం తాడేపల్లికి రావాలని ఆదేశించిన్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బాలినేని ఇదివరకే జగన్‌కు ఫిర్యాదు చేసినందున, రేపు వారిద్దరికీ రాజీ చేసేందుకు ప్రయత్నించవచ్చు.
అయితే వైవీ సుబ్బారెడ్డితో రాజీ పడేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏమాత్రం ఇష్టపడటం లేదని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చి రాజీపడాలని ఆదేశిస్తే బాలినేని పార్టీ వీడాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇదివరకే టిడిపిలో చేరేందుకు సిద్దపడిన సంగతి అందరికీ తెలిసిందే.
కనుక ఒంగోలు వైసీపి నేతల పంచాయితీలో జగన్ ఇద్దరికీ రాజీ కుదర్చగలరా లేక వైవీ సుబ్బారెడ్డినే ఉంచుకొని బాలినేనిని వదులుకొంటారా?అనేది రేపు తాడేపల్లిలో జరుగబోయే సమావేశంలో తేలిపోవచ్చు.




