పాపం రేవంత్! ఇలా దొరికిపోయారేమిటి?

Bandi Sanjay and KTR Counters Revanth Reddy

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గచ్చిబౌలి భూముల విషయంలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం అర్దరాత్రి నుంచి సమ్మెకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కనుక సమ్మె ఆలోచన విరమించాలని ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. కానీ వారికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత వివరించే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, ఢిల్లీ వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలని చూసినట్లు చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తదితర ఉద్యోగులకు నెల నెలా జీతాలు చెల్లించలేకపోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

ఆంధ్రాలో జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులే ఉండేవి. కానీ జగన్‌, వైసీపీ మంత్రులూ ఏనాడూ తమ అసమర్దత, వైఫ్యల్యాలను ఒప్పుకోలేదు.

తమ పాలన అద్భుతం, అమోఘం అని సెల్ఫ్ సర్టిఫై చేసుకునేవారు. జగన్‌ పాలనలో అరాచక పరిస్థితిని భరించలేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలిపోతున్నా రాష్ట్రానికి అందరూ క్యూ కడుతున్నారని జగన్‌ ఇమేజ్ చూసి ఏకంగా రూ.13.36 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టారని గొప్పలు చెప్పుకునేవారు.

కానీ రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితి చెప్పుకొని తన ప్రభుత్వాన్ని తానే తక్కువ చేసి చూపుకున్నట్లయింది. రేవంత్ రెడ్డికి పాలన చాతకాక అప్పుడే చేతులెత్తేశారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదని తనకు తానుగా కూలిపోయేలా ఉందన్నారు.

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్‌ అన్నారు. తన పదవి కాపాడుకోవడానికి నెలనెలా ఢిల్లీకి సూట్ కేసులు మోసుకువచ్చే వారిని ఎవరు మాత్రం గౌరవిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

కేసీఆర్‌ అప్పు తెచ్చిన ప్రతీ రూపాయితో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే శాశ్విత కట్టడాలు అనేకం నిర్మిస్తే, రేవంత్ రెడ్డి 16 నెలల పాలనలో రాష్ట్రంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేకపోయారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళితే చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళు వచ్చారన్నట్లు ఎవరు చూస్తున్నారో చెప్పాలి. ఆయన ఢిల్లీ వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అందరూ అపాయింట్‌మెంట్‌ ఇస్తూనే ఉన్నారు. కానీ తన చాతకానితనానికి కేంద్రాన్ని నిందిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలన అంటే ఇలాగే ఉంటుందని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించి చూపుతున్నారు,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories