టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మొదట కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికలలో బిజెపి ఓడిపోవడంతో తెలంగాణలో టిడిపి మద్దతు కోరేందుకే వారు చంద్రబాబుతో వారు భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఏపీలో టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి బిజెపి నిరాకరిస్తున్నప్పుడు, తెలంగాణలో బిజెపికి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తారు? అని ఆలోచిస్తే వారు ఏపీలో టిడిపితో పొత్తుల గురించి చర్చించేందుకే భేటీ అయ్యుండవచ్చనే సహేతుక వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
మీడియాలో వస్తున్న ఈ వార్తలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, “ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. మోడీ, అమిత్ షాలు ఇదివరకు నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశమయ్యారు. కనుక చంద్రబాబు నాయుడుతో భేటీ అవడానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. తెలంగాణలో బిజెపి బలపడుతుండటంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే ఇటువంత్ దుష్ప్రచారాలు చేస్తున్నాయి. తెలంగాణలో టిడిపితో పొత్తులు పెట్టుకోవలసిన అవసరం మాకు లేదు. బిజెపి ఒంటరిగానే పోటీ చేసి కేసీఆర్‌ను గద్దె దించి అధికారంలోకి రాబోతోంది,” అని అన్నారు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
త్వరలో జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని బిజెపి అధిష్టానం చాలా పట్టుదలగా ఉంది. కానీ కొమ్ములు తిరిగిన బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఢీకొనేందుకు తెలంగాణ బిజెపిలో బలమైన నాయకులే లేరు. కనుక ఇతర పార్టీలలో బలమైన నేతలను ఆకర్షించి బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.
కేసీఆర్‌ను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలెవరూ కూడా బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలంగాణ బిజెపి పార్టీ చేరిక కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కుండ బద్దలు కొట్టారు. కనుక తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు టిడిపి సహాయసహకారాలు అవసరమని అర్దమవుతోంది.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
తెలంగాణలో బిజెపికి సహకరించాలంటే, ఏపీలో తప్పనిసరిగా టిడిపికి సహకరించాల్సి ఉంటుంది. అంటే వారు టిడిపి-బిజెపిల పొత్తుల గురించే చర్చించి ఉండవచ్చని స్పష్టం అవుతోంది.
వారు దేని గురించి చర్చించారనే విషయం ప్రస్తుతం బయటపెట్టకపోయినప్పటికీ, రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే రాజకీయ పరిణామాలు, సీబీఐ కేసులలో కదలికలతో స్పష్టత వస్తుంది.