బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కోసం పోరాటాలు చేస్తున్నామని బీసీలను నమ్మించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కవిత తాపత్రయపడుతున్నారు. నమ్మించేందుకు అని ఎందుకు అనాల్సివస్తోందంటే, కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 250 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం అంగీకరిస్తే తప్ప ఇది అమలు కాదు. కల్వకుంట్ల కవిత పోరాటాలతో అసలే కాదు కనుక!
ఆగస్ట్ 5,6,7 తేదీలలో తెలంగాణ కాంగ్రెస్ అధ్వర్యంలో దిల్లీలో దీని కోసం హడావుడి చేయబోతుంటే, వారి కంటే ఒక రోజు ముందుగా అంటే ఆగస్ట్ 4 నుంచి కవిత కూడా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్స్ కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానిని స్వాగతించి మద్దతు పలికిన కవిత, ఇప్పుడు ధిల్లీలో కాంగ్రెస్ నేతలు చేయబోయే దీక్షని తప్పు పట్టడం ద్వారా గందరగోళం సృష్టించారని చెప్పక తప్పదు.
కానీ ఈ అంశంపై ‘నాకు మాత్రమే’ చిత్తశుద్ధి, నిబద్దత ఉన్నాయని నిరూపించుకునేందుకు ఆమె హడావుడిగా మూడు రోజులు దీక్ష ప్రకటించినట్లు ఆమె మాటలతోనే అర్ధమవుతోంది.
తెలంగాణ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేయబోతున్న ఈ బీసీ రిజర్వేషన్స్ అంశంపై కవిత ఇంత హడావుడి చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తుండటంతో ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనా? అనే అనుమానం రేకెత్తిస్తోంది.
కేసీఆర్ నిన్న ఫామ్‌హౌసులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి ఎట్టి పరిస్థితులలో బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
కనుక కూతురు కవితకు బీసీ రిజర్వేషన్స్ అంశం విడిచిపెట్టి, బీఆర్ఎస్ పార్టీ ‘చంద్రబాబు నాయుడు-బనకచర్ల ప్రాజెక్టు’తో రాజకీయాలు చేయాలని కేసీఆర్ వర్క్ డివైడ్ చేసి ఇచ్చారా? అనే అనుమానం కలుగుతుంది.




