పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బొమ్మ సిల్వర్ స్క్రీన్ పై పడింది. యుఎస్ ప్రీమియర్ టాక్ ఇచ్చిన కిక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానుల కోలాహలం నడుమ “భీమ్లా నాయక్” సందడి మొదలైంది. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ఏ సినిమాకు రానంత పాజిటివ్ టాక్ ఈ సినిమాకు లభించింది.
ఒక రకంగా చెప్పాలంటే ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచే సినిమాగా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటోంది. పవర్ స్టార్ – రానాల అభినయానికి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ “భీమ్లా నాయక్”కు అసలు బలంగా నిలుస్తోంది. “అఖండ”తో అమోఘమైన కీర్తి ప్రతిష్టతలను అందుకున్న థమన్, ‘భీమ్లా’తో మరో మెట్టుకు ఎదిగినట్లయ్యింది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పవన్, రానాల తర్వాత ప్రస్తావించే పేరు ఎస్.ఎస్.థమన్. అంతలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చెలరేగిపోయాడు. ఇక పవన్ – రానాలు ఎదురెదురుగా వచ్చే సన్నివేశాలను చెప్పడం కన్నా, సిల్వర్ స్క్రీన్ పైన చూస్తేనే బాగుంటుంది. ఫ్యాన్స్ కు కావాల్సిన టాక్ వచ్చింది, కానీ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ హంగామా మాత్రం కానరావడం లేదు.
టాక్ తో నిమిత్తం లేకుండా పవన్ ఫ్యాన్స్ మొదటి రోజు తమ అభిమానాన్ని అంతా సోషల్ మీడియాలో ముంచేస్తుంటారు. కానీ నేడు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం గమనించదగ్గ పరిణామం. ఏదో అడపాదడపా తప్ప పెద్దగా ఫ్యాన్స్ రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తారస పడకపోవడం ఊహించని అంశం. కల్ట్ ఫ్యాన్స్ గా కేటీఆర్ చేత కితాబు అందుకున్న పవన్ ఫ్యాన్స్ లోని మార్పుకు ఇది నిదర్శనమా? లేక ధియేటర్ల వద్ద పూర్తిగా ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారా?



