వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ బాధపడ్డారా లేక తనకు లైన్ క్లియర్ అయ్యిందని సంతోషించారా?అంటే సమాధానం అందరికీ తెలుసు. ఓదార్పుయాత్రతో ఆ సానుభూతి పునాదులపై వైసీపీని చాలా ధృడంగా నిర్మించుకున్నారు.
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంత వరకు జగన్ తండ్రి పేరుని, ఆయన బ్రాండ్ ఇమేజిని వాడుకుంటూనే ఉన్నారు. అధికారం కోల్పోయాక మళ్ళీ రోజూ స్మరిస్తున్నారు.
అయితే వైసీపీలో జగన్ ఒక్కరే కాదు దాదాపు అందరూ ఇదే ఫార్ములాని ఒంటబట్టించుకున్నట్లున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హయంలో జరిగిన అపచారాలకు ఆ దేవుడే శిక్ష విధిస్తాడు. కానీ చేసిన అవినీతికి టీటీడీ లెక్కలు తీసి చట్ట పరంగా చర్యలు తీసుకోబోతోంది.
ఈ విషయం టిటిడీ చైర్మన్ లేదా భూమన చెప్పలేదు. ఆయన కుమారుడు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినవ్ రెడ్డి బయటపెట్టారు!
టీటీడీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి పై అక్రమకేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలిసిందని ట్వీట్ చేశారు. అయితే ఈ కేసులు, జైళ్ళకు భయపడేవాడు కాడు నా తండ్రి… అరెస్ట్ చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి. మా తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి.
కేసులు, అరెస్టులతో నియోజకవర్గంలో వైసీపీ నేతల నోళ్ళు మూయించలేరని గ్రహిస్తే మంచిది. నా తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కడిగిన ఆణిముత్యంలా బయటకి వస్తారు. ఆయన బయటకు వచ్చే వరకు ప్రత్యర్ధుల గుండెల్లో నిద్రపోతాము,” అని ట్వీట్ చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ ఇంకా కేసు కూడా నమోదు చేయక ముందే ఆయన కుమారుడు భూమన అభినవ్ రెడ్డి జైలు వరకు స్టోరీ అంతా చెప్పేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో చురుకుగా రాజకీయాలు చేస్తున్నంతకాలం అభినవ్ రెడ్డి తండ్రి చాటు కొడుకుగా మిగిలిపోతున్నారు. బహుశః అందుకే సినిమా టైటిల్స్ పడక ముందే అభినవ్ రెడ్డి క్లైమాక్స్ గురించి మాట్లాడేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.





