వైసీపీ నవరత్నాలు అంటూ ముందుకెళితే, కూటమి నవ నిర్మాణాలు అంటూ సాగుతుంది. నాటి నవరత్నాలను వైసీపీ ఓటు బ్యాంకు గా భావిస్తే, నేటి నవ నగరాలను కూటమి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు మార్గదర్శకాలుగా పరిగణిస్తుంది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అరణ్యంగా మారిన అమరావతి నేటి కూటమి పాలనతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే అమరావతి నవ నగరాల నిర్మాణాలలో ఒకటిగా అమరావతిలో ఒక భాగాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి బాబు.
ఇప్పటికే అమరావతి కేంద్రంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన విట్, SRM, అమృత వంటి విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ యువతకు వలస చదువుల భారాన్ని తగ్గించాయి. ఇక ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన బిట్స్ పిలానీ అమరావతిలో అడుగు పెట్టనుంది.
1000 కోట్లతో బిట్స్ పిలానీ అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసుందుకు ముందుకొస్తున్నట్టు ఆ సంస్థ ఛాన్సెలర్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. అలాగే అమరావతిలో ఏర్పాటు చేసే సంస్థకు AI+ క్యాంపస్ గా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు.
ఇందులో ప్రముఖంగా AI, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్, ఇండస్ట్రీ ఇంటర్న్ షిప్, రీసెర్చ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్, జాయింట్ phDs వంటి కోర్సులు ఈ క్యాంపస్ లో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు వేస్తున్నట్టు కోర్స్ వివరాలు కూడా ప్రకటించారు కుమార మంగళం.
మొత్తం 7 వేలమంది విద్యార్థుల సామర్ధ్యంతో 2027 నాటికీ క్యాంపస్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీనితో బిట్స్ పిలానీ ఏర్పాటు ద్వారా అమరావతికి మరో మణిహారం తోడైనట్టే భావించాలి.
అయితే ఈ క్యాంపస్ ఏర్పాటుకు గాను ప్రభుత్వం ఇప్పటికే 35 ఎకరాలు భూమిని కేటాయించగా మరో 70 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అలాగే రాజధాని అమరావతిలో పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
కిమ్స్ ఆసుపత్రికి నిడమర్రులో 25 ఎకరాలు, సిబిఐ కి రాయపూడిలో 3.5 ఎకరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ కి గాను తుళ్ళూరులో 3 ఎకరాలు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు కు గాను రాయపూడిలో 3 ఎకరాలు, గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, MSK ప్రసాద్ క్రికెట్ అకాడమీ కి 12 ఎకరాలు, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకు, బీజేపీ ఆఫీస్ కి చెరో 2 ఎకరాల చప్పున భూకేటాయింపులు జరిపింది కూటమి ప్రభుత్వం.
అయితే నాడు స్మశానం అంటూ రాజధాని అమరావతిని పాడుపెట్టిన వైసీపీ నేడు అమరావతి వెలుగులను చూసి సహించగలుగుతుందా.? అమరావతి ముంపు ప్రాంతం, నిర్మాణాలకు అనువైన ప్రదేశం కాదు అంటూ ప్రచారం చేస్తున్న నీలి మీడియా ఈ సంస్థల రాకను స్వాగతించగలదా.?
వైసీపీ హయాంలో మూడు రాజధానుల నిర్ణయం తో స్మశానం అంటూ సమాధి చేసిన అమరావతి నేడు విద్యాసంస్థల రాకతో, క్రీడా రంగం అభివృద్ధితో నవనగరాల నిర్మాణంతో సువర్ణంగా మారబోతుంది.




