జాతీయపార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా అధికారంలోకి రాగలమనే నమ్మకం ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కనిపిస్తోంది. మంచిదే! కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కనుక తమకు ఓట్లేయమని అడిగే హక్కు వారికి ఉంటుంది.
Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రయోజనాల కోసం ఆంధ్రా కాంగ్రెస్, ఆంద్రా ప్రజల అభీష్టాన్ని, మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రా ప్రజలను ఓట్లు వేయమని అడిగే నైతిక హక్కు లేదు.
కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ నెత్తినపెట్టుకొనే మోసినా కాలితో తన్ని అవమానించింది. రాష్ట్రవిభజన చేసినా కనీసం ఆంధ్రాకు పూర్తి న్యాయం చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించేవారేమో కానీ ఆంధ్రాకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు ఆంధ్రా ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి?
Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే
అసలు ఆనాడే ఆంధ్రా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేస్తే, మునిగిపోతున్న ఆ టైటానిక్ షిప్పులో నుంచి కాంగ్రెస్ నేతలందరూ వైసీపీలోకి దూకేసి తమ రాజకీయ జీవితాలు కాపాడుకొన్నారు. వారందరినీ మళ్ళీ పార్టీలో రప్పించుకొని ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలతో ప్రాణప్రతిష్ట చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీని ఇంతగా నష్టపరిచిన కాంగ్రెస్ పార్టీ కొత్త ముసుగు వేసుకొని వస్తే ఆదరించాల్సిన అవసరం ఉందా?
ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాను విభజించి దారుణంగా దెబ్బ తీస్తే, బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలుచేయకపోగా, ప్రజల అభిమతాన్ని, మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం కంటే బిజెపి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ నాలుగేళ్ళుగా సాగుతున్న మూడు రాజధానుల ఆటని ప్రేక్షకుడిలా చూస్తోంది.
Also Read – అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?
ఏపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో ఏపీ పెను సంక్షోభంలో కూరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పనులు నత్తనడకలు నడుస్తుంటే దానిని పూర్తిచేయించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.
ఏపీని గాడిన పెట్టేందుకు కేంద్రం ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా ఏపీలో తమ బిజెపి బలోపేతం చేసుకొని వీలైతే ఏపీలో కూడా అధికారంలోకి రావాలని, లేదా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా, వచ్చినా దాని ఎంపీలందరూ తమకే అండగా నిలబడాలని మోడీ ప్రభుత్వం కోరుకొంటోంది. ఏపీలో మూడు ప్రధాన పార్టీల బలహీనతలు, ఏపీలో పరిస్థితులు బిజెపికి కలిసి వచ్చే అంశాలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఏపీలో రాజకీయాలు చేసేందుకే కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించింది.
ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టం కలిగించిందో, బిజెపి కూడా అంతే నష్టం కలిగించింది. ఏపీని కాంగ్రెస్ ఎంతగా అవమానించిందో బిజెపి అంతకంటే ఎక్కువగానే అవమానిస్తోంది. అయినా రెండు పార్టీలు ఆంధ్రా ప్రజలు తమని నెత్తిన పెట్టుకొని మోయాలని ఆశిస్తున్నాయి. ఆంధ్రా ప్రజలు సిద్దమేనా?