నాలుగేళ్ళుగా మూడు రాజధానులు, మూడు రంగులతో కళకళలాడుతూ ఎదురేలేదన్నట్లు సాగిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికలు దగ్గర పడేసరికి పరిస్థితులు క్రమంగా తారుమారు అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఓ వైపు ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు, మరో వైపు యువగళం పాదయాత్రతో దూసుకొస్తున్న టిడిపి యువనేత నారా లోకేష్, నేటి నుంచి వారాహితో ఉభయగోదావరి జిల్లాలలో జనసైన్యంతో కదులుతున్న పవన్ కళ్యాణ్, మద్యలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలతో వైసీపీని చుట్టుముట్టినట్లవడంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మూడు రాజధానులతో అటు రాయలసీమలో ఇటు ఉత్తరాంద్రలో టిడిపి, జనసేనలు కాలుమోపకుండా అడ్డుకొందామనుకొంటే ఆ వ్యూహం బెడిసికొట్టిందని యువగళం పాదయాత్రతో స్పష్టం అయ్యింది.
గత ఎన్నికలలో నారా లోకేష్‌ని కించపరుస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బతీసిన వైసీపీ, ఈసారి పవన్ కళ్యాణ్‌పై గురిపెట్టింది. ఆయనను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, ముగ్గురు భార్యలంటూ ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ రాజకీయంగా, మానసికంగా దెబ్బతీయాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ దాని ఉచ్చుకు చిక్కడం లేదు. టిడిపితో కలిసి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
రోమ్ నగరం మంటల్లో తగలబడుతుంటే, ఫిడేలు వాయించుకొంటూ కూర్చోన్న నీరో చక్రవర్తిలా ఇంతకాలం నిమ్మకుండిపోయిన బిజెపి కూడా ఇప్పుడు హటాత్తుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటే, వైసీపీ నేతలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియడం లేదు.
ఇంతకాలం సంయమనం పాటించిన తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా నేరుగా వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా దారుణంగా విఫలమైందని, ఏపీలో కరెంటు కోతలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని విమర్శించడం మొదలుపెట్టారు.
వైసీపీ ప్రభుత్వం మీడియాను కూడా తోడేళ్ళ గుంపులో చేర్చి వేధిస్తున్నందున పలు మీడియా సంస్థలు కూడా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగడుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపును అన్ని మీడియా సంస్థలు చాలా హైలైట్ చేస్తుండటంతో వైసీపీ నేతలు ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం ఒక్కటీ మరో ఎత్తు. ఆయన జైలులోకి వెళితే వైసీపీ పునాదులు కదిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఓ వైపు తమ ప్రభుత్వంపై కత్తులు దూయడం ప్రారంభించిన మోడీ ప్రభుత్వం వద్ద నుంచే నిధులు, అప్పులు సంపాదించుకోవడం, ఎన్నికల వరకు సంక్షేమ పధకాలకు డబ్బు సమకూర్చుకోవడం వంటి ఈతి బాధలు చాలానే ఉన్నాయి.
ఆనాడు టిడిపి ప్రభుత్వం పదవీకాలం ముగుస్తున్న సమయానికి ఈవిదంగానే నలుదిశల నుంచి శత్రువులు చుట్టుముట్టారు. వారి ధాటికి చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడం అందరూ చూశారు. కనుక వైసీపీ కధ ముగింపు దశకు చేరుకొంటున్నట్లే కనిపిస్తోంది.



