దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవలసిరావడం చాలా బాధాకరమే కానీ ఇదే చేదు నిజం. ఎందుకంటే ప్రజలు అమరావతిని రాజధానిగా భావిస్తున్నా వైసీపీ ప్రభుత్వం భావించడం లేదు కనుక! ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తే అమరావతి నేడు మరో విదంగా ఉండేది. అప్పుడు అందరూ తప్పకుండా అమరావతిని రాజధానిగా గుర్తించి ఉండేవారు.
వైసీపీకి అమరావతి రాజధానిగా ఆమోదం కాదని స్పష్టమైపోయింది. కానీ మూడేళ్ళు నిద్రపోయి లేచి ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్న బిజెపికి చిత్తశుద్ధి ఉందా?అంటే సమాధానం ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె లక్ష్మణ్ చెప్పారు.
ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కె లక్ష్మణ్‌ను ఓ ప్రశ్న అడిగారు. “తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా భావోద్వేగ సంబంధాలున్నాయి. తెలంగాణలో 25 నియోజకవర్గాల్లో సెటిలర్లు గెలుపోటములను నిర్ణయించే స్థితిలో ఉన్నారు కదా?” అని రాధాకృష్ణ ప్రశ్నించారు.
దానికి ఎంపీ కె.లక్ష్మణ్ సమాధానం చెపుతూ “హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు మేము అధ్యయనం చేశాం. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని డివిజన్లలో మంచి ఫలితాలు రాలేదు. అంటే సీమాంద్రులు మా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని గ్రహించాం. రాజధాని అమరావతి విషయంలో బీజేపీపై ఉన్న వారి అనుమానాలను అమిత్ షా నివృత్తి చేసే ప్రయత్నం చేసినా.. దానిని మావాళ్లు సరిగా చేరవేయలేకపోయారు,” అని అన్నారు.
అంటే తెలంగాణ సీమాంద్రా ఓట్లు గురించే ఇక్కడ ఏపీలో బిజెపి అమరావతి పాట పాడుతోంది తప్ప దానికి చిత్తశుద్ధి లేదని అర్దమవుతోంది. తెలంగాణలో ఇప్పుడు బిజెపి చాలా బలపడి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాగలమనే గట్టి నమ్మకంతో ఉంది కనుక తెలంగాణలో ప్రతీ ఓటు దానికి చాలా అమూల్యమైనదే. కనుక కనీసం ఆ ఓట్లు కోసమైనా అమరావతి నిర్మాణం జరిగేలా చేస్తే ఇక్కడ ఏపీలో ప్రజలు చాలా సంతోషించేవారు.
ఒకవేళ బిజెపికి చిత్తశుద్ది ఉన్నట్లయితే, మోడీ కనుసన్నలలో మెలుగుతున్న సిఎం జగన్మోహన్ రెడ్డిని అమరావతినే రాజధాని చేయాలని ఆదేశిస్తే కాదనే సాహసం చేయగలరా? కానీ ప్రధాని నరేంద్రమోడీ నేటికీ ఈ విషయంలో జగన్‌ను ఒత్తిడి చేయడం లేదు. కానీ ఇక్కడ అమరావతిలో బిజెపి నేతలు పాదయాత్రలతో హడావుడి చేస్తున్నారు. అవి తెలంగాణలో స్థిరపడిన సీమాంద్ర ఓటర్లను మభ్యపెట్టేందుకేనని స్పష్టమవుతోంది.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా, అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తిచేయకుండా ఈవిదంగా కపట నాటకాలు ఆడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఇలా రాజకీయ పరాచికాలు ఆడినందుకే కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారని బిజెపి గ్రహించినట్లు లేదనుకోలేము. కానీ ఏపీఓ బిజెపి ఈవిదంగా ఎందుకు వ్యవహరిస్తోంది? అంటే ఏపీలో ఇప్పట్లో అధికారంలోకి రాలేమని భావిస్తున్నందునే! అందుకే ఏపీలో ఏం చేసినా చెల్లుతుంది… ఆర్ధికంగా ఏపీ దివాళా తీస్తున్నా పట్టించుకోవడంలేదని భావించవలసి ఉంటుంది. కానీ ఏపీలో అన్ని పార్టీలు అదే బిజెపితో పొత్తులకు ప్రాకులాడుతుండటం విశేషం.



