ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీకి పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పరాజయం ఊహించని షాక్ ఇచ్చింది. యూపీలో ఫుల్ పూర్, గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా, తొలుత రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్న బీజేపీ, ఆ తర్వాత పూర్తిగా వెనుకబడి ఓటమి పాలయ్యింది. ఈ నియోజకవర్గంలో బీఎస్పీ మద్దతుతో బరిలోకి దిగిన సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు.
ఇక, యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్ పూర్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ పటేల్ తొలుత ముందంజలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత అనూహ్యంగా సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక బీహార్ లోనూ బీజేపీకి పూర్తి అనుకూల ఫలితాలేమీ వెలువడలేదు. అరారియా లోక్ సభ లో బీజేపీ లీడింగ్ లో ఉండగా, భాబువా అసెంబ్లీలో గట్టి పోటీ నెలకొంది. జహానాబాద్ లో ఆర్జేడీ విజయం దిశగా దూసుకెళుతోంది.
యూపీలో జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోగా, బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం పార్టీ నేతలను విస్మయానికి గురయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు లభించినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు రాలేదు.



