ఆంధ్రప్రదేశ్ కు తాము చేసిన అన్యాయం నుండి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ కొత్త ఎత్తులు వేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ప్రాంతీయ బేధాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీ. నిన్న ఉన్న ఫలంగా రాయలసీమ డిక్లరేషన్ అని ఒకటి విడుదల చేసి అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు జిల్లాలను ఎనిమిదికి పెంచాలని ఈ డిక్లరేషన్‌లో సూచించారు. అలాగే రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటుగా రూ.10వేల కోట్లు కేటాయించాలని కోరారు.రాయలసీమలో ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నడపాలని కూడా కోరారు.
వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు రూ.20వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. అసలు అమరావతి నిర్మాణానికే నిధులు ఇవ్వని బీజేపీ రెండో రాజధాని డిమాండ్ చెయ్యడం హాస్యాస్పదం. రెండో రాజధానికి కేంద్రం నుండి నిధులు తెస్తారా రాష్ట్ర బీజేపీ నేతలు? ఆరు నెలలకు ఒకసారి సీమలో అసెంబ్లీ సమావేశాలు నడిపితే ఆ ప్రాంతానికి ఏమి దక్కుతుందో వారికే తెలియాలి.
మరి అదే విధంగా దక్షిణ భారత దేశంలో 6 నెలల పాటు పార్లమెంట్ సమావేశాలు జరపొచ్చు కదా. నిర్లక్షానికి గురవుతున్నాం అన్న భావన ఇక్కడ ప్రజలలో కూడా ఉందిగా. రాయలసీమకు 20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు సరే. అసలు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నా దేశంలోని అన్ని వెనుకబడిన జిల్లాలతో సమానంగా ఏడాది కేవలం ఒక్కో జిల్లాకు 50 కోట్లు మాత్రమే ఇచ్చిన ఘనత వీరిది కదా? 50 కోట్లతోనే అభివృద్ధి అయిపోతాది అంటే ఇంక ఏ మొహం పెట్టుకుని 20000 కోట్లు డిమాండ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ను మరోసారి విభజిస్తాం అని బెదిరిస్తున్నారా? ఇటువంటి చీప్ రాజకీయం వారిని ప్రజలకు దగ్గర చేస్తుంది అనుకుంటే అది వారి అపోహే!



