వర్తమాన కాలంలో మీడియా ప్రసారాల తీరు ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి మీడియా సంస్థ కూడా ఏదొక రాజకీయ పార్టీ రంగు పులుముకున్నదే. ఇందుకు ఏ ఒక్క మీడియా సంస్థ కూడా మినహాయింపు కాదు. అయితే ఏ మీడియా సంస్థకైనా కొన్ని వార్తలను మార్చడానికి అవకాశం ఉండదు.
రాజ్యాంగపరమైన అంశాలకు మరియు కోర్టులు ఇచ్చే తీర్పులను మార్చడం, ఏమార్చడం అనేది ఏ మీడియా సంస్థ చేయదగ్గ విషయాలు కావు, నిజానికి అవి ఏ మీడియా సంస్థ పరిధిలో కూడా ఉండవు. కానీ ఇక్కడ విస్తుపోయే విషయం ఏమిటంటే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం కోర్టు తీర్పులను కూడా తప్పుగా ప్రచారం చేస్తూ వాటి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.
నేడు హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయానికే వస్తే, జరిగిన విషయం ఏమిటంటే, అసలు ఈ కేసులో అరెస్ట్ అనే అంశమే లేదు గనుక, ముందస్తు బెయిల్ అంశమే పరిగణనలోకి తీసుకునే అంశం కాదని విచారణను ముగించింది. కానీ జగన్ అనుకూల మీడియా సంస్థలు చేస్తోన్న ప్రచారం చూస్తుంటే, సదరు మీడియా సంస్థలపై ఏహ్యభావన ఏర్పడడం సహజం.
కోర్టు ఇచ్చిన తీర్పును ఏమారుస్తూ ‘లోకేష్ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు – హైకోర్టులో లోకేష్ కు చుక్కెదురు’ అంటూ అవాస్తవ ప్రచారాన్ని భుజానకెత్తుకున్నాయి. సదరు మీడియా సంస్థలను టీడీపీ వర్గాలు ‘బ్లూ మీడియా’గా కొనియాడుతుండగా, బహుశా వారి నీలిచాయాలు ప్రజలకు మరింత స్పష్టంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రసారాలు చేస్తున్నారేమో అనిపించక మానదు.
ఈ అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తీవ్రంగా స్పందించారు. లోకేష్ బెయిల్ గురించి కొన్ని డబ్బా ఛానెల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ‘disposed’కు – dismiss’కు ముందు తేడా తెలుసుకోండి తింగరోల్లారా… అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా, నేడు మరో రెండు కేసుల్లో కూడా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలు జరగనున్నాయి. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో కూడా నేడు మధ్యాహ్నం విచారణ జరగనున్న నేపథ్యంలో… ‘బ్లూ మీడియా’ ఈ సారైనా కళ్ళు తెరుచుకుని కోర్టు ఇచ్చే తీర్పులను ఇచ్చినట్లుగా ప్రసారం చేస్తాయో లేక తాము రాసుకున్న రాతలను ప్రజలపై రుద్దాలని చూస్తాయో వేచిచూడాలి.



