ఆ మీడియాలు ఇంకా మేడి పండులేనా..?

Blue-Media-News-Channel

మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే సామెత ఇప్పుడు కొన్ని మీడియా ఛానెల్స్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారినా కొన్ని మీడియా ఛానెల్స్ మాత్రం ఇంకా ప్రజా తీర్పును ఒప్పుకోలేకపోతున్నాయా అనేలా ప్రవర్తిస్తున్నాయి.

ADVERTISEMENT

దీనితో ఆ మీడియాలు ఇంకా మేడి పండు మాదిరే పైకి ప్రజల కోసం పని చేస్తున్నాం అంటూ లోలోపల ప్రజలను పట్టించుకోని వారి కోసం శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఈ న్యూట్రల్ మీడియా పేరిట నడిచే కొన్ని ఛానెల్స్ ఇంకా వైసీపీ పార్టీ కి జై కొడుతూ జగన్ జపమే చేస్తున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడని సదరు మీడియా సంస్థలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా బయట ప్రపంచానికి చెప్పడానికి, చూపించడానికి ఆసక్తి చూపించడం లేదు.

ప్రభుత్వాలు చేసే ప్రజాప్రయోజనాల కార్యక్రమాల కన్నా ప్రభుత్వం పై, ప్రభుత్వ పెద్దల పై వైసీపీ నేతలు చేసే నీచ విమర్శల మీదే ద్రుష్టి పడుతున్నాయి సాక్షి, దాని అనుబంధ ఛానెల్స్. వైసీపీ నేతల అస్లీల కార్యక్రమాలను బయట పెట్టాల్సిన సదరు మీడియా సంస్థలు వారిని ఇంటర్ వ్యూ లు చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద చర్చ పెడుతున్నారు.

ప్రభుత్వంలో ఉన్న పవన్ తన శాఖల మీద ఎంత శ్రద్ద పెడుతున్నారు..? అటు సినిమాలను ఇటు రాజకీయాలను ఎలా మేనేజ్ చేస్తున్నారు.? తనను డిప్యూటీ సీఎం గా చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, ఆ ప్రాంతానికి పవన్ చేసిందేమిటి.? అనే రాజకీయ చర్చలు లేవు. ఇంకా పవన్ పెళ్లిళ్లు పవన్ భార్యలు అంటూ అవే పాత చింతకాయ పచ్చడి కబుర్లు.

విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం అందించిన సాయం గురించి చెప్పాల్సిన మీడియా ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో జగన్ వేసిన పోస్టుల గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు వ్యక్తిగత జీవితాలకు సంబంధం ఉంది అంటూ నొక్కి వక్కాణించిన ఆయా మీడియాలు ఇప్పుడు మాత్రం ఆ రెండిటి సంబంధం లేదు అంటూ నిర్దారిస్తుంది.

గతంలో అప్పటి ప్రతిపక్ష నేత బాబు ఇంటి మీదకు దాడికి వెళ్లిన వైసీపీ నేతల భుజం కాసిన ఈ బ్లూ మీడియా ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల పై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతుందా అంటూ కథనాలు ప్రచురిస్తున్నాయి. గత ప్రభుత్వ పాలనలో నడి రోడ్డు మీద డాక్టర్ మీద దాడి చేసిన నోరు విప్పని మీడియాలు ఇప్పుడు మాత్రం వైసీపీ నేతల మీద తెగ సానుభూతి చూపిస్తున్నాయి.

ఈ బ్లూ మీడియా ను అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లు వైసీపీ నేతలు కొడాలి, రోజా, పేర్ని, వంశీ, అంబటి వంటి నేతలు ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పినా ఎన్నడూ దానిని ఖండించలేదు. అలాగే వైస్ కుటుంబం పంచాయితీ అయినా జగన్, షర్మిల ఆస్తి తగాదాల గురించి కానీ, వివేకా కుమార్తె సునీత..జగన్, భారతి ల మీద చేసిన విమర్శలను కానీ లైట్ తీసుకున్న ఈ సంస్థలు జూ.ఎన్టీఆర్ టీడీపీ కి మద్దతు పలుకుతాడా.? బన్నీ జనసేనకు ఎసరు పెడతారా.? అంటూ చర్చలు జరిపారు.

ఇప్పటికి ఈ మీడియా సంస్థల వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు అని చెప్పడానికి ఇక్కడ మరో ఉదాహరణను చూపించవచ్చు. వైసీపీ ఓటమితో జగన్ ఒక మెట్టు దిగి షర్మిలతో రాజీ భేరానికి వచ్చాడంటూ కొన్ని మీడియాలో వార్తలు గుప్పుమన్నా, షర్మిల…జగన్ మధ్య రాజీ రాయబారం కోర్ట్ కెక్కింది అంటూ సోషల్ మీడియా కోడైకూస్తున్నా సదరు మీడియాలు మాత్రం ఈ వార్తల మీద లైబ్రరీ మోడ్ లో నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి.

గత ఐదేళ్లు రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిన “చెడును చూడను, చెడుని వినను, చెడును చెప్పను”…అంటూ త్రీ మంకీస్ సూచిక మాదిరి వ్యవహరించిన ఈ బ్లూ మీడియా ఏపీ విధ్వంసంలో తన వంతు పాత్ర పోషించదనే చెప్పాలి.

దాని ఫలితమే గత కొన్నేళ్లుగా టీడీపీ నేత నారా లోకేష్ నుంచి ప్రత్యక్ష విమర్శలు ఎదుర్కొంటు కూడా వాటికి కౌంటర్ వేయలేకపోతున్నాయి సదరు మీడియా సంస్థలు.

ADVERTISEMENT
Latest Stories