రాజకీయ షల్టర్ కావలెను..!

botsa-satyanarayana-peddireddy-ramachandra-reddy-dharmana-prasada-rao

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యింది. దానితో అప్పటి వరకు తమ రాజకీయ సీనియారిటీ తో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి రాష్ట్ర రాజకీయాలలో ఉన్నత పదవులు అనుభవించిన నేతందురు ఒక్కసారిగా రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు.

అయితే అటువంటి నేతందరికి వైసీపీ ఉపాధిని కల్పించి తన అక్కున చేర్చుకుంది. పదేళ్ల వైసీపీ రాజకీయ అడుగులలో ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడుగుకలిపి తమ రాజకియ భవిష్యత్తుకు ఒక గ్యారంటీ కార్డును సంపాదించుకున్నారు. 2019 వైసీపీ గెలుపు ఈ సీనియర్లకు వరంలా దక్కి తిరిగి తమ పదవులను తాము అధిరోహించారు.

ADVERTISEMENT

అందులో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, మల్లాది విష్ణు, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణకర్ రెడ్డి వంటి సీనియర్లందరూ తమ హవా నిలుపుకున్నారు. అయితే గత ప్రభుత్వం లో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న నాయకులందరూ వేలకోట్ల అవినీతి చేసినట్లు కూటమి ప్రభుత్వం ఆధారాలతో ఆరోపిస్తుంది.

అలాగే అధికారంలో ఉన్నాం అనే అహంకారాన్ని ప్రదర్శించి అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన అధినాయకులు మొదలు ఆ పార్టీ ముఖ్యనేతలందరి మీద నోరు పారేసారు వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో బాబుతో సహా టీడీపీ నేతలందరి మీద కేసులు మోపి జైళ్లకు పంపించారు జగన్. జగన్ చేసిన దానికల్లా వంత పాడిన సదరు నేతలు ఇప్పుడు వైసీపీ ఓటమి తరువాత పక్క చూపులు చూసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను ఎలా అయితే తమ ఓటుతో చావు దెబ్బ కొట్టారో అదే విధంగా జగన్ ఒక్క ఛాన్స్ విధ్వంసం చూసిన తరువాత కూడా వైసీపీ ని అదే విధంగా 151 నుంచి 11 సీట్లతో పూడ్చి పెట్టారు ఏపీ ప్రజానీకం. ఇప్పటి వరకు తమకు వైసీపీని రాజకీయ షల్టర్ గా భావించిన ఈ సీనియర్ నేతలందరికీ ఇప్పుడు అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మరో రాజకీయ పార్టీ అండ కావాల్సి వచ్చింది.

అయితే టీడీపీ ఇప్పటికే “హౌస్ ఫుల్” బోర్డు పెట్టేసినట్లే కనిపిస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే రెగ్యులర్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా జనసేన తొలి నుండి అడుగులు వేస్తూ వస్తుంది. అటువంటి పార్టీలో ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకు చోటు దక్కుతుందా? అంటే సందేహమే. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం తమ పార్టీలో ఖాళీలు ఉన్నాయి అంటూ “టు లెట్” బోర్డులు పెట్టుకుని మరి ఎదురు చూస్తున్నాయి.

నాటి ప్రభుత్వంలో కూటమి నేతల దూకుడు చూస్తుంటే, వారు ప్రజలతో మమేకమయ్యే విధానం గమనిస్తుంటే 2029 లో కూడా వైసీపీ కి మరో ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. దీనితో వైసీపీలోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశార్ధకమే అన్న భావనలోకి కాంగ్రెస్ కుటుంబ సీనియర్లంతా ఉన్నట్టు సమాచారం. వైస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి నాయకుల కోసం ఎదురు చూస్తుంది.

కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను, లీడర్లను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకు వస్తాను అంటూ షర్మిల వైసీపీ పతనం కోసం పంతం పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సీనియర్లకు రాజకీయ షల్టర్ కల్పించడానికి కాంగ్రెస్ ముందు వరుసలో వచ్చి నిల్చుంది. మరి తిరిగి తమ పుట్టినింటికి చేరుకోవడానికి ఈ నాయకులంతా సిద్ధమా? కాదా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories