అందరూ వేలెత్తి చూపుతున్నా తగ్గేదేలే….

Botsa Satyanarayana Challengeమాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో సహా దేశంలో చాలా రాష్ట్రాలకు చెందిన నేతలు తప్పు పడుతూనే ఉన్నారు. ఇటువంటి విషయాలలో చాలా ఆచితూచి మాట్లాడే పొరుగు రాష్ట్రంలోని బిఆర్ఎస్‌ నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తున్నారు.

ADVERTISEMENT

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, “రాజకీయాలలో కక్ష సాధింపులు సరికాదు. మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుని ఈవిదంగా అరెస్ట్ చేయడం సరికాదు,” అని అన్నారు.

వెంటనే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “స్పీకర్ పదవిలో ఉన్న పోచారం లాంటి వ్యక్తులు పొరుగు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టడంవాటికి రాజకీయ దురుదేశ్యాలు అంటగట్టడం సరికాదు. రాజకీయాల గురించి మాట్లాడితే తప్పు లేదు కానీ వ్యవస్థలనే వేలెత్తి చూపడం సరికాదు. ఇలాంటి నేరాలు మీ ప్రభుత్వంలో జరిగితే విడిచిపెట్టేస్తారా?మీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చెప్పమనండి,” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఓ ప్రభుత్వ నిర్ణయాలను మరో ప్రభుత్వం తప్పు పట్టడం సరికాదని కూడా చెప్పలేము. పలు అంశాలలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పరం విమర్శించుకొన్నాయి. నేటికీ కృష్ణా, గోదావరి జలాల గురించి కీచులాడుకొంటూనే ఉన్నాయి.

ఇది కేవలం అవినీతి కేసే అయితే ఎవరూ చంద్రబాబు నాయుడు అరెస్టుని వేలెత్తి చూపేవారే కారు. కానీ చంద్రబాబు నాయుడుని, టిడిపికి ఏపీ నుంచి రాజకీయంగా తుడిచిపెట్టేయాలని వైసీపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందునే దేశ, విదేశాలలోఅందరూ వేలెత్తి చూపిస్తున్నారు.

అక్రమాస్తులు, వివేకా హత్య కేసులలో తమను అన్యాయంగా ఇరికించారని, తాము అమాయకులమని వాదిస్తున్న వైసీపి నేతలు, చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం అదే వాదనలను అంగీకరించడం లేదు.

వారికి టిడిపితో రాజకీయ వైరం ఉంది కనుక వారు ఈవిదంగానే ఆలోచించడం, వ్యవహరించడం సహజమే. కానీ ఈ విషయంలో ఇంతమంది ఇది తప్పని వేలెత్తి చూపిస్తున్నా పునరాలోచించుకోకపోవడమే తప్పు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేయగలిగామని వైసీపి నేతలు చాలా సంతోషపడుతుండవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుని ఎల్లకాలం జైలులో బందించి ఉంచగలరా? నేడు కాకపోతే రేపు ఏదో ఓ రోజున ఆయనకు బెయిల్ దొరకకపోదు. రాజకీయ సమీకరణాలు మారకుండా ఉండవు. కనుక ఇప్పుడు తమను వేలెత్తి చూపుతున్న అందరిపై ఎదురుదాడి చేయడం కంటే రేపు తమ పరిస్థితి ఏమిటని ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories