ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విశాఖలో జరిగిన గురుపూజోత్సవంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిద జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనవారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముందు ఉపాధ్యాయులు మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి ఈనెల ఇంతవరకు జీతాల పడలేదని చెప్పగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పడతాయిగా… తొందరెందుకు?అని విసుక్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేదికపై మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ సమక్షంలోనే నందలూరు జూనియర్ కళాశాల తెలుగు లెక్చరర్ నీలవేణి ప్రసంగిస్తూ, “ఉపాధ్యాయ వృత్తికి మరేదీ సాటిరాదు. ఇందులో కధలతోపాటు అనేక వెతలు, గాయాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మాకు సకాలంలో జీతాలు చెల్లిస్తుంటే, మేము కూడా విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పగలం. మేము విద్యార్థులను ఏవిదంగా ప్రేమాభిమానాలతో చూసుకొంటామో, ప్రభుత్వం కూడా మమ్మల్ని అదేవిదంగా చూసుకొంటూ మాచేత పనిచేయించుకోవాలి,” అని సున్నితంగా చురకలు వేశారు.
దీనిని బట్టి ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఏవిదంగా ప్రవర్తిస్తోందో అర్దమవుతుంది. గురుపూజోత్సవం కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్నప్పుడు, ముందుగా ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించి ఉంటే హుందాగా ఉండేది. కానీ జీతాలు చెల్లించకుండా ‘సన్మానాలు చేస్తాం సంతోషపడండి’ అన్నట్లు వ్యవహరించడం ఉపాధ్యాయులను చాలా బాధించింది. అందుకే మంత్రి, కార్యదర్శి సమక్షంలోనే తెలుగు లెక్చరర్ నీలవేణి ఆవిదంగా వారికి హితవు పలకాల్సి వచ్చింది.
ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి బొత్స సత్యనారాయణ అవార్డులు, జ్ఞాపిక, రూ.20 వేలు నగదు అందించవలసి ఉంది. అవార్డులు, జ్ఞాపికలు అందించారు కానీ నగదు బహుమతి ఇవ్వనే లేదు! ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనవారి బ్యాంక్ ఖాతాల వివరాలను తీసుకొని తర్వాత వారి ఖాతాలలో ఆ సొమ్ము జమా చేస్తామని అధికారులు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 196 మంది ఉపాధ్యాయులకు రూ.39.2 లక్షలు చెల్లించాల్సి ఉండగా అదీ చెల్లించలేకపోవడం సిగ్గుచేటు కాదా? సిఎం జగన్ వారం వారం బటన్ నొక్కి వందల కోట్లు సంక్షేమ పధకాలకు పంచిపెడుతుంటారు. కానీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు రూ.20 వేల నగదు బహుమతి ఇవ్వలేక పోయింది. నగదు బహుమతిని తర్వాత ఇస్తామని అరువు పెట్టడం సిగ్గుచేటు కాదా?
విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు ముందుగా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది కదా? వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకుండా ఒత్తిడికి గురిచేస్తుంటే విద్యావ్యవస్థలో మార్పు ఎలా వస్తుంది?మంత్రి, కార్యదర్శి సమక్షంలోనే వేదికపైనే ఉపాధ్యాయులు తమ జీతాల సమస్యను బాహాటంగా చెప్పారు. ఇంకా ఎలా చెప్పాలి?ఎలా చెపితే ఈ ప్రభుత్వానికి అర్దమవుతుంది?అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.



