ఏపీకు మూడు రాజధానులు, రెండు రాజన్న రాజ్యాలు… ఇద్దరు దైవదూతలు!

Brother Anil Sharmila Jagan Vimala Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు మూడు ఉండాలని జగన్మోహన్‌ రెడ్డి ఏ ముహూర్తంలో నిర్ణయించారో కానీ ఇప్పటి వరకు అసలు రాజధానే లేకుండా పోయింది. అయితే రాజధాని మాత్రమే కాదు వైఎస్ షర్మిల రాకతో ఇప్పుడు ఏపీ ప్రజలకు రెండు ‘రాజన్న రాజ్యాలు’ కూడా అడగకుండానే లభిస్తున్నాయి.

ADVERTISEMENT

అలాగే ఏపీని, ప్రజలను కాపాడేందుకు ఒక దైవదూత సరిపోరని జగన్‌ నమ్ముకునే ఆ పైవాడు అనుకున్నాడో ఏమో మరో దైవదూతని కూడా పంపించాడు. ఆమె అంతర్జాతీయ సువార్తికులు వైఎస్ విమలా రెడ్డి! బ్రదర్ అనిల్ కుమార్‌ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తుండటంతో వైసీపి కోసం ప్రార్ధించేవారిని తెచ్చుకోక తప్పలేదు.

కనుక మూడు రాజధానులు, రెండు రాజన్న రాజ్యాలు, ఇద్దరు దైవదూతలున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుంది. మరే రాష్ట్రానికి ఇలాంటి ఆఫర్ లభించలేదు. కేవలం ఏపీకి మాత్రమే లభించింది.

ఇక విషయానికి వస్తే ఏపీ సిఎం జగన్‌ రెడ్డి, మంగళవారం ఉరవకొండ బటన్ నొక్కుడు సభలో చెల్లెమ్మలు కానీ చెల్లెమ్మల కోసం చాలా ఆరాటపడ్డారు కానీ సొంత చెల్లెలు వైఎస్ షర్మిలని మాత్రం చంద్రబాబు నాయుడుకి ‘స్టార్ క్యాంపెయినర్’ అని తేల్చిపడేశారు.

తాను ప్రజలకు మేలు చేసేస్తుంటే చూసి ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకొంటున్న చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టుల ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి చేసి ఈ స్టార్ క్యాంపెయినర్‌ని తెచ్చుకున్నారని ఆవేదన చెందారు.

దుష్టుడు, దుర్మార్గుడు అయిన చంద్రబాబు నాయుడునే అందరూ నమ్ముతున్నారని ఆవేదన చెందారు. ఆయనకు కాంగ్రెస్‌, బీజేపీ, జనసేనతో సహా అన్ని పార్టీలలో కోవర్టులు, స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. వారందరూ కలిసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆరాటపడుతున్నారని జగన్‌ కనిపెట్టి చెప్పారు. అలాగే మీడియాలో కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినర్లున్నారని వారు కూడా తనపై బురద జల్లుతూ చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

మొత్తం మీద లోకంలో అందరూ చెడ్డవాళ్ళేనని జగన్మోహన్‌ రెడ్డి నిర్ధారించేసి, వాళ్ళ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, మీకు మేలు చేస్తున్న తననే మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలని ముగించారు.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు పెద్దలు. కానీ లోకంలో అందరూ తాననే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారని ఆలోచించే బదులు వేలెత్తి చూపిస్తున్నవాళ్ళు అందరూ దుష్టులు, దుర్మార్గులు అని చెపుతున్నారు. ఆ జాబితాలో సొంత చెల్లెలు వైఎస్ షర్మిలని కూడా చేర్చేసారు ఇప్పుడు.

అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా తమనే నమ్మమని ప్రజలను కోరుతున్నారు. మరి అన్న గురించి చెల్లెలు చెప్పింది నమ్మాలా లేక చెల్లెలు గురించి అన్న చెపుతున్నది నమ్మాలా?

ADVERTISEMENT
Latest Stories