నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మాగంటి సునీత చేత నామినేషన్ వేయించారు. ఆమెను అభ్యర్ధిగా ప్రకటించిన రోజు నుంచే ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం తధ్యమని కేటీఆర్ నొక్కి చెపుతున్నారు. కనుక అందుకు తగ్గట్లుగానే చాలా జోరుగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తోంది.
హైడ్రా కూల్చివేతలు వంటి ఓ అరడజను కారణాల వలన ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని కూడా ఆయనే చెప్పేశారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌ని ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ షాక్ అయ్యింది. ఎందుకంటే అయన ఇదివరకు మజ్లీస్ పార్టీలో ఉండేవారు. ఓసారి ఆ పార్టీ తరపున పోటీ చేశారు కూడా. కనుక మజ్లీస్ అధినేత నవీన్ యాదవ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించి, ఆయననిఒ గెలిపించాల్సిందిగా జూబ్లీహిల్స్‌లోని పార్టీ శ్రేణులకు, ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నవీన్ యాదవ్‌కు కొందరు సినీ ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ సామజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య కూడా చాలా భారీగానే ఉంది.
ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు మంచి పేరున్న దివంగత ఎమ్మెల్యే పీ జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయా రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆమె నవీన్ యాదవ్ తరపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ వేడి ఇంకా అలాగే ఉంది కనుక నియోజకవర్గంలో బీసీలందరూ చౌదరి, రెడ్డి సామాజిక వర్గాలకి చెందిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపిలకు ఓట్లు వేయకపోవచ్చు.
ఈ నేపధ్యంలో చూస్తే ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది. తమ ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో మళ్ళీ ఈ సీటు గెలుచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం.
కనుక ఆయన భార్య మాగంటి సునీతని అభ్యర్ధిగా ప్రకటిస్తే సానుభూతి ఓట్లు రాలుతాయని భావించింది. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్‌ని ఎదుర్కోవడం ఆమె వల్లకాదని గ్రహించినట్లుంది. కనుక ఈ నియోజకవర్గంపై మంచి పట్టున్న పీ.జనార్ధన్ రెడ్డి కుమారుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి చేత హడావుడిగా నామినేషన్ వేయించింది.
అంటే సునీతని పక్కని పెట్టేసినట్లే భావించవచ్చు. కానీ ఒకవేళ ఆమె నామినేషన్ తిరస్కరించబడితే ముందు జాగ్రత్త కోసమే డమ్మీ అభ్యర్ధిగా పీ విష్ణువర్ధన్ రెడ్డి చేత నామినేషన్ వేయించామని బీఆర్ఎస్ పార్టీ సర్ది చెప్పుకుంటోంది.
ఒక అభ్యర్ధి చేత నామినేషన్ వేయించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టేసిన తర్వాత హటాత్తుగా అభ్యర్ధిని మార్చితే ఓటమికి భయపడే మార్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోకమానదు. కనుక ఈ ప్రచారంతోనూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్పకపోవచ్చు.




