నేటి రాజకీయాలు బూతులతో మిళితమైపోయాయి అనే చేదు నిజాలను బిఆర్ఎస్ నేత రాజయ్య తన ఘాటు వ్యాఖ్యలతో మరోసారి రుజువు చేసారు. బిఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీని వీడిన సీనియర్ నేతలలో కడియం శ్రీహరి ఒకరు.
ముఖ్యమంత్రి కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టవడం బిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది అంటూ తన కుమార్తె కావ్య తో కలిసి గులాబీ గూటి నుంచి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు కడియం.
పార్టీ రంగు మారడంతో కడియం పాత పార్టీ నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే ఈ రాజకీయ విమర్శలు తన పరిధి దాటి వెళ్లిపోతున్నాయి అనేలా బిఆర్ఎస్ నేత రాజయ్య సీనియర్ రాజకీయ నాయకుడైన కడియం శ్రీహరి పై బూతుల తో రెచ్చిపోయారు.
ఒరేయ్ కడియం అంటూ మొదలు పెట్టిన రాజయ్య నీకు సీము నెత్తురు ఉందా.? నువ్వు మగాడివైతే వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి అంటూ రాజకీయాల నయా ట్రెండ్ ను ఫాలో అయ్యారు రాజయ్య.
అయితే బిఆర్ఎస్ నేతలు ప్రత్యర్థుల పై ఈ విధంగా రెచ్చిపోవడం ఇది కొత్తేమి కాదు. అయితే నాడు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను, ఓడిన పార్టీ అభ్యర్థులను గులాబీ కారెక్కించేసారు.
అలాగే పార్టీ అధినేతల నిర్ణయాలతో సంబంధం లేకుండానే పార్టీలను తమ పార్టీలలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించి తెలంగాణలో ప్రత్యర్థి రాజకీయ పార్టీ అనేదే లేకుండా విపక్ష నాయకులు అనేవారు రాకుండా నియంతలా రాజ్యమేలారు.
కానీ నేడు బిఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాజ్యాంగం కూని అయిపొయింది, రాజకీయాలలో విలువలు చచ్చిపోయాయి, రేవంత్ సర్కార్ ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తుంది అంటూ నానా హంగామా చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు.
నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా అన్న సామెతను బిఆర్ఎస్ పూర్తిగా విస్మరిస్తూ ఇలా పార్టీ రెబల్ అభ్యర్థుల మీద బూతులతో రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసం.? కడియం శ్రీహరి రాజకీయంగా తప్పుచేశారా.? తప్పటడుగు వేసారా అనేది ప్రజా కోర్టులో తేలుతుంది.
అలా కాకుండా బిఆర్ఎస్ నేతలు ఈలోపే బూతులతో రెచ్చిపోతే నాటి వైసీపీ పరిస్థితి నేడు బిఆర్ఎస్ దుస్తితిగ మారే ప్రమాదం ఉంది.





