బీజేపీ ప్రకటనలు..బిఆర్ఎస్ కంపిస్తుందా.?

BRS Faces MLA Exodus to BJP

బిఆర్ఎస్ ను వెంటాడుతున్న సీరియల్ కష్టాలు, ఒక పక్క కవిత రచ్చ, మరోపక్క కేసుల రొచ్చు, ఇంకో పక్క పార్టీ నేతల ఫిరాయింపు కార్యక్రమాలు, పార్టీ విలీన ప్రకటనలు ఇలా బిఆర్ఎస్ ను ఓటమి ఊబి నుంచి బయటకు రానివ్వడం లేదు.

ఇక ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ లో ఐదుగురు ఎమ్మెల్యే లు త్వరలో బీజేపీ కాషాయ కండువా కప్పుకోబోతున్నారు అంటూ టి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించారు.

ADVERTISEMENT

అయితే ఈయన ప్రకటన వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ బిఆర్ఎస్ లో ఎదో జరగబోతుంది అనే ఆందోళన ఆ పార్టీ కింద స్థాయి నాయకులను కలవర పెడుతుంది.సహజంగా పార్టీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఆయా పార్టీలోని నేతలు అధికార పార్టీ వైపు ఆకర్షితులవుతారు.

కానీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కాదని బిఆర్ఎస్ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు అంటే బిఆర్ఎస్ భవిష్యత్ బీజేపీ గుప్పెట్లో ఉందని భావిస్తున్నట్టా.? లేక కేసీఆర్ కారు స్టీరింగ్ ఢిల్లీ కంట్రోల్ లోకి వెళ్లిందనుకోవాలా.?

ఇప్పటికే 10 మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరడంతో 39 గా ఉన్న బిఆర్ఎస్ బలం 29 కి పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా తన రాజీనామాతో గులాబీ కారు దిగిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నెల 10 న బీజేపీ కమల తీర్ధం అందుకోనున్నారు. దీనితో ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే ల బలం 28 కి చేరింది.

గువ్వల మాదిరి మరికొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీ లో చేరుతున్నారు అంటే ఇక ఇప్పుడు ఈ అంకే మరో ఐదుకి కుదించబడుతుంది. దీనితో బిఆర్ఎస్ బలం 23 కి దిగజారనుంది.

అయితే రామచందర్ చెపుతున్నట్టు ఆ ఐదుగురు ఎమ్మెల్యే లు ఎవరు అనే చర్చ కూడా అటు టి.బీజేపీ లో ఇటు గులాబీ కోటలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సాహసానికి ముందుకొస్తారు అనుకోవడం బీజేపీ అత్యాసే అవుతుంది.

కాకపోతే GHMC వంటి ప్రాంతాల నేతలు బీజేపీ వైపు చూసే అవకాసం ఉంది. ఒకపక్క కవితేమో బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అంటూ విమర్శలు చేస్తుంటే, మరోపక్క బీజేపీ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ రామచందర్ ప్రకటనలు చేస్తున్నారు.

బీజేపీ నేతల ఈ ప్రకటనలు అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కే కాదు అధికార కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యే లు అధికార పార్టీని కాదని మూడో ప్రత్యామ్నాయం అయినా బీజేపీ వైపు చూస్తున్నారు అంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఎదురుగాలి తప్పదనే సంకేతాలు పంపినట్టే అవుతుంది.

మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న ఈ ఫిరాయింపుల ప్రకటనలు బిఆర్ఎస్ లో ప్రకంపనలు పుట్టిస్తాయా.? కాంగ్రెస్ పార్టీని ఆలోచనలలో పడేలా చేస్తాయా.? అలాగే బీజేపీ లో నూతన ఉత్సహాన్ని నింపుతాయి.? అనే ప్రశ్నలన్నిటికి కాలమే బదులు చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories