రాజకీయాలకు కొత్త అర్దాలను వెతకాలా అనేలా రాజకీయ నాయకుల ప్రవర్తన నానాటికి దిగజారిపోతోంది. గెలిచి అధికార పీఠం ఎక్కినోడో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన నాయకులు అదే తీరుని ఎంచుకోవడం అత్యంత దురదృష్టకరం.
ఏపీ రాజకీయాలలో బూతుల సంస్కృతిని పరిచయం చేసి దగ్గరుండి పోత్సహిస్తున్నారు ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన గారు పలానా శాఖ మంత్రి గారు అనడం మానేసి ఆ బూతుల మంత్రేనా అనే స్థాయికి మంత్రి పదవులను దిగజార్చారు కొందరు అధికార పార్టీ నేతలు.
ఇటువంటి నాయకుల చేతిలో అధికారం ఉండడంతో ఇప్పటికే రాజకీయ అంటే భవిష్యత్ తరానికి ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. “మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలోచెప్పాలి” అనేది పాతకాలం నాటి సామెత ఇప్పుడు ట్రెండ్ మారింది సామెత కూడా మారింది. “బూతులు బజారుకొచ్చి మైకులలో తిట్టాలి, ప్రవచనాలు ఇంట్లో ఒక మూలాన కూర్చొని వినాలి” అనేలా తయారయ్యారు ఈ నాటి రాజకీయ నాయకులు.
ఇంద్రవెల్లి సభలో మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇప్పటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హద్దుదాటి ఒక అడుగు ముందుకు వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ చేసిన వ్యాఖ్యలు ఒక అడుగు కాదు ఏకంగా వంద అడుగులు ముందుకెళ్లాయి.
పాగల్ గాడు.., హౌ….గాడు, ఈ చెత్త నా…..,చెప్పుతో కొడతా..,ఖబడ్దార్ బిడ్డా…అంటూ బిఆర్ఎస్ నేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సభావేదిక సాక్షిగా వాడు వీడు అంటూ, బీప్ సౌండ్స్ తో సంబోధించడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలి. పార్టీ అధినాయకత్వం కూడా ఇటువంటి వారిని కట్టడి చేయకపోతే రాజకీయాలు అంటే రౌడీ ఇజం, బూతులు తిట్టడం, ప్రత్యర్థులను బెదిరించడం, మాట వినకపోతే అంతమొందించడం అన్నట్లుగా మారిపోతాయి.
భవిష్యత్తులో ఇటువంటి వారే రాజకీయాల తలుపులు తట్టగలరు. ఇప్పటికే రాజకీయాలు.. కులాల చుట్టూ, మతాల మాటున, డబ్బే పరమావధిగా, అధికారమే అంతిమ లక్ష్యంగా తన రూపాన్ని మార్చుకున్న తరుణంలో ఇప్పుడు నేతలు ఇటువంటి కొత్త సంస్కృతులను రాజకీయాలలోకి తీసుకురావడం, వాటిని పెంచి పోషించి ప్రత్యర్థుల మీదకు వదలడం వంటివి మారక పోతే ప్రజాస్వామ్యానికి విలువ పోతుంది అనేది రాజకీయ పార్టీలు గ్రహించాలి.




