పార్టీ ‘పేరే’ కాదు ‘గుర్తు’ కూడానా.?

brs-party-is-going-to-merge-in-bjp---kavitha

బిఆర్ఎస్ పార్టీకి కవిత ఒక అణుబాంబు మాదిరి తయారయ్యిందనే చెప్పాలి. ఇప్పటికే కేసీఆర్ కు కవిత రాసిన లేఖ తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కేసీఆర్ కుటుంబం వైపు చూసేలా చేసాయి.

ఇక కాంగ్రెస్ లో కవిత చేరిక లాంఛనప్రాయమే అంటూ ABN లో వచ్చిన కథనాలు బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చింది. ఇక జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం రోజున కవిత మరో కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలతో అసలు బిఆర్ఎస్ లో ఎం జరుగుతుంది, కేసీఆర్ కుటుంబంలో కూడా రాజకీయ కలహాలా అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చర్చ విస్తృతమయ్యింది.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు కవిత చేసిన మరో ఆరోపణ బిఆర్ఎస్ ఉనికికి, కేసీఆర్ అస్తిత్వానికే ప్రమాదకరంగా కనిపిస్తుంది. బిఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేసేందుకు తెరచాటు రాజకీయం జరుగుతుందని, తానూ జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన తెస్తే అందుకు తానూ వ్యతిరేకించానని, ఈ విలీనం కుట్ర వెనుక దాగి ఉన్న ఆ రాజకీయ ఉద్దేశాలు ఏంటి అంటూ కవిత మరోసారి బిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టెల, తండ్రి కేసీఆర్ ను పరోక్షంగా నిలదీస్తున్నారు.

ఇంటి ఆడ బిడ్డకు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది.? నా పై మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచారంలో ఉన్నా పార్టీ తరుపున ఎవ్వరు వాటిని ఎందుకు ఖండించడం లేదు.? తానూ తన తండ్రికి రాసిన లేఖను బయటకు లీక్ చేసిన ఆ అదృశ్య శక్తి ఎవరు.? అంటూ కవిత మరోమారు పార్టీ పెద్దల పై పలు ఘాటు ప్రశ్నలే సంధించారు.

అయితే పార్టీ పై కవిత సంధించిన ప్రశ్నలకన్నా కూడా బిఆర్ఎస్ పై కవిత చేసిన విలీన ఆరోపణలే కేసీఆర్ ను ప్రమాదంలో నెట్టేసే అవకాశం ఉంది. గత ఎన్నికలలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ గా ఉన్న ప్రాంతీయ పార్టీని బీజేపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ‘భారతీయ రాష్ట్ర సమితి’ గా మారుస్తూ జాతీయ పార్టీగా రూపాంతరం చేసారు కేసీఆర్.

దీనితో పార్టీ పేరు మారింది, కేసీఆర్ తలరాత కూడా మారింది. ఇక ఇప్పుడు తాజాగా కవిత చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు ఉంటే అతి త్వరలో “గులాబీ కాస్త కమలం” పార్టీగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా “గులాబీ జెండాలు” మోసిన కేసీఆర్ సైన్యం ఇక నుంచి “కాషాయం” పట్టుకోబోతున్నారా.? కేసీఆర్ గులాబీ కారు కాషాయం రంగు తొడుక్కోబోతుందా.? అన్న ప్రశ్నలను కేసీఆర్ అభిమానులే బిఆర్ఎస్ మద్దతుదారులు సైతం జీర్ణించుకోలేరు.

ఇప్పటికే పార్టీ పేరు మార్పుతో కేసీఆర్ పతనం మొదలైతే పార్టీ రంగు, గుర్తు మారితే ఇక తెలంగాణలో కేసీఆర్ ఉనికి కోల్పోయినట్టే అవుతుంది. అయితే అసలు బీజేపీ తో బిఆర్ఎస్ విలీనం అన్న ప్రచారం ఈ నాటిది కాదు. బీజేపీ గెలుపు కోసమే 2018 లో కవితను సొంత వారే బలిపీఠం ఎక్కించారని, కవిత ఓటమి కి బిఆర్ఎస్ కు బీజేపీ తో ఉన్న తెరచాటు సంబంధాలే కారణం అనే వాదన కూడా అప్పట్లో గట్టిగానే నడిచింది.

ఇక 2023 బిఆర్ఎస్ ఓటమి తరువాత, కవిత అరెస్టు కు ముందు ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకొచ్చింది. కవిత అరెస్టు తరువాత పరిణామాలు అందుకు మరింత బలం చేకూర్చాయి. కవిత అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్నది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న అంశం.

అయితే ఆ సమయంలో పార్టీ అధినేత నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు బీజేపీ కి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేకపోయారు. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ కేసీఆర్ పై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్, అలాగే అటు ఫోన్ టాపింగ్, ఈ ఫార్ములా రేసింగ్ అంటూ కేటీఆర్ పై పలు కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నా, కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల భయం తప్పాలన్నా, గులాబీ కి కమలం సాయం తప్పనిసరి. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు అదును చూసి దెబ్బ కొట్టి తన దారికి తెప్పించుకోవడంలో బీజేపీ కి అపార అనుభవం ఉంది.

ఇప్పుడు ఆ అనుభవాన్ని బిఆర్ఎస్ ఉనికి పై కేసీఆర్ అస్తిత్వం పై కొట్టేందుకు బీజేపీ సిద్దమయ్యింది అనేది కాంగ్రెస్ పార్టీ తో పాటుగా కవిత కూడా ఆరోపిస్తున్నారు. మరి కనీసం కవిత చేస్తున్న ఈ ఆరోపణలు పై అయినా కేసీఆర్ ముందుకొస్తారా.? లేక బీజేపీ నేతలతో పనికానిచ్చేస్తారా.?

ADVERTISEMENT
Latest Stories