రాష్ట్ర రాజకీయాలలో ఎక్కాల్సిన మెట్లన్నీ పూర్తయ్యాయి ఇక దేశ రాజకీయాలలో చక్రం తిప్పి జాతీయ రాజకీయాలను శాసించేద్దాం అనుకున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్లమెంట్ లో కనీసం తన పార్టీ తరుపున గళం వినిపించే అవకాశం కూడా లేకుండా పోయింది.
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరుపున ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా ప్రజల విశ్వాసాన్ని సాధించుకోలేక పోవడంతో పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. నేడు జరిగిన పార్లమెంట్ స్పీకర్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అటు ఎన్డీయే కూటమి vs ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ పడ్డారు.
అయితే రెండు కూటములకు సమాన దూరం పాటిస్తున్నాం అంటున్న వైసీపీ కూడా రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అయినా ఎన్డీయే కూటమికే మద్దతు తెలియ చేసి మోడీకి జై హుజూర్ అంటూ జై కొట్టింది. అయితే బిఆర్ఎస్ పార్టీ తరుపున కూడా ఎంపీ అభ్యర్థులు ఉండి ఉంటే వారికీ రాష్ట్రంలో ఈ రెండు కూటములు ప్రత్యర్థులే కావడంతో ఎవరికీ ఓటు వేసే వారు అనే చర్చ జరుగుతుంది.
ఒక వేళ బీజేపీ ని కాదని కాంగ్రెస్ కూటమి ఓటు వేస్తే అసలే కూతురు కవిత అరెస్టయ్యి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా బయటకు రాలేని పరిస్థితి, ఎప్పటికి వస్తుందో కూడా చెప్పలేని దుస్థితి కేసీఆర్ ది. ఇటువంటి సందర్భంలో మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా.?
అలాగే కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని కాదని బీజేపీ కూటమికి మద్దతిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి అదును చూసి దెబ్బ కొట్టే అవకాశం లేకపోలేదు. దీనితో కేసీఆర్ పరిస్థితి కుడితలో పడ్డ ఎలక మాదిరి తయారయ్యేది.
బిఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలను గెలిచి ఉంటే కేసీఆర్ కు ఈ సమస్య మరో ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది. పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కూడా కేసీఆర్ కు ఒక రకంగా మేలే చేసినట్లయింది. దీనితో ఒక్కోసారి గెలవడం కంటే ఓడిపోవడం మేలు అంటూ కేసీఆర్ పై సానుభూతు చూపిస్తున్నారు ఆయన మద్దతుదారులు.




