BRS Party KTR

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఆయనే దిక్కు. ఓ పక్క కేసీఆర్‌ పేరు చెప్పుకుని ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్న బిఆర్ఎస్ పార్టీ, మరో పక్క చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటోంది. తెలంగాణలో రాజకీయాలు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పేరుని వాడుకోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉండిపోయి బిఆర్ఎస్ పార్టీని కొడుకు కేటీఆర్‌కి అప్పగిస్తే,కేవలం దాదాపు ఏడాదిన్నరలోనే ఆ పార్టీని బీజేపిలో విలీనం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ఈ మాట అన్నది మరెవరో కాదు ఆయన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత!

Also Read – చీకట్లో వేసేసి పగలు పరామర్శించాలట!

బిఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు, కోవర్టులు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని ఆమె చెప్పారు. తన అన్న నాయకత్వాన్ని అంగీకరించనని కుండ బద్దలు కొట్టారు. కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దామని హరీష్ రావు చెప్తున్నప్పటికీ, ఆయనకు మాత్రం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండదా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కనుక కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించిన మరుక్షణం హరీష్ రావు, కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

బిఆర్ఎస్ పార్టీలోనే కోవర్టులు, పెయిడ్ ఆర్టిస్టులున్నారని కల్వకుంట్ల కవిత చెపుతుంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడి కోవర్టు అని కేటీఆర్‌ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఎలా చెపితే రేవంత్ రెడ్డి అలా చేస్తున్నారని, ఏపీకి నీళ్ళు తరలించుకుపోయేందుకు చంద్రబాబు నాయుడుకి తోడ్పడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..

మొన్నటి వరకు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేసింది. ఆ ప్రాజెక్టు ఫైలుని కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపగానే దాని క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నాక ఇక దాని గురించి మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో, రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి ‘తెలంగాణ సెంటిమెంట్’ రగిలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది.

కానీ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడే ‘తెలంగాణ సెంటిమెంట్’ పనిచేయలేదని స్పష్టమైంది కదా? అయినా బిఆర్ఎస్ పార్టీ స్థాపించిన 25 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పుకొనిదే మనుగడ సాగించలేకపోవడం, లక్షల మంది కార్యకర్తలున్నా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవాలనుకోవడం బిఆర్ఎస్ పార్టీ బలహీనతకి, డొల్లతనానికి నిదర్శనం కావా?

Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం

ఇంకా ఎంతకాలం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది? ఇంకా ఎంతకాలం నీళ్ళ గొడవలతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయలేదనుకుంటే ఆ పార్టీని టీడీపీలో విలీనం చేసేస్తే బాగుంటుంది కదా?