రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార మార్పిడి జరగడంతో అటు ప్రజలు గత పాలకులకు ఇప్పటి ప్రతిపక్షాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిశితంగా గమనిస్తూ తమ భవిష్యత్ కార్యాచరణకు పునాది రాళ్లు పరుచుకుంటున్నారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల అమలుతో అక్కడ కొన్ని ప్రాంతాల ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా దూరం జరుగుతూ ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ కు దగ్గరవుతున్నారు.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైడ్రా బాధితులు. ప్రభుత్వం తమ కళ్ళ ముందే తమ జీవితకాల కష్టాన్ని బుల్డోజర్లతో కూలుస్తుంటే వాటిని చూసి తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయిన కుటుంబాల గాధలు వర్ణనాతీతమనే చెప్పాలి.
ఇక గ్రూప్ 1 పరీక్షల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన విద్యార్థులకు రేవంత్ సర్కార్ లాఠీ దెబ్బలను బహుమతిగా ఇచ్చింది అంటూ ఆయా బాధిత కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు.
ఇలా ప్రజలలో పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ఈ ప్రభుత్వ నిర్ణయాలను తమ బలంగా మార్చుకుని 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బిఆర్ఎస్ ఓటమి తరువాత కొద్దికాలం కుదుటపడడానికి ప్రభుత్వానికి సమయం ఇచ్చి, ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే వరకు వేచి చూసి ఆ సమయం వచ్చాకా తన వ్యూహాలకు పదును పెడుతుంది బిఆర్ఎస్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పార్టీ గొంతు వినిపించడానికి ప్రజా మద్దతు ఉన్నపటికీ కేసీఆర్ ఇంకా ప్రభుత్వం వేసే తప్పటడుగుల కోసం కాసుకొని కూర్చున్నారు.
అయితే తెలంగాణలో ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఇలా ఒక ప్రణాళిక ప్రకారం వెళుతుంటే ఏపీలో విపక్షమైన వైసీపీ మాత్రం తన తిక్క చేష్టలు వదులుకోవడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు షురూ చేసింది వైసీపీ.
గత ప్రభుత్వ వైఫల్యాల వలన కాదు ఈవీఎం ల సెట్టింగ్ ఫలితంగానే వైసీపీ కి ఈ స్థాయి అపజయం వచ్చిందని కూటమి పార్టీలకు ఆ స్థాయి విజయం దక్కిందంటూ ప్రజా తీర్పుని వ్యతిరేకిస్తూ తనను, తన పార్టీని తానే ప్రజలలో పలుచన చేసుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.
దానికి తోడు గత ఐదేళ్ల తన అధికారంలో ప్రజా సమస్యల మీద స్పందించడానికి ప్యాలస్ గడప కూడా దాటని జగన్ ఇప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా దర్బార్, జనవాణిల పేరిట కూటమి నేతలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలను చూసి కూడా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి షూటింగ్ లు చేసుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు.
గత నెలలో ఏపీలో వరదలు సృష్టించిన జలప్రళయానికి అటు ప్రభుత్వం ఇటు దాతలు ముందుకు వచ్చి ఏపీ ప్రజలకు అండగా నిలిస్తే ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి, విపక్షములో ఉన్న వైసీపీ మాత్రం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటన రూపంలో బాధితులకు అందించి ప్రజలు ఛీత్కారాన్ని చవి చూసింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా జగన్ తండ్రి ఆస్తి కోసం తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల మీద కోర్ట్ కెళ్ళడం వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణించవచ్చు. నోరు తెరిస్తే ‘విలువలు…విశ్వసనీయత’ అంటూ జగన్ చెప్పే సుద్ద పూస కబుర్లకు ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా అసహ్యించుకునే పరిస్థితికి వచ్చారు.
బిఆర్ఎస్ పార్టీకి ప్రజలతో, ప్రత్యర్థులతో ఎప్పుడు రాజకీయాలు చెయ్యాలో ఎప్పుడు రాజీ పడాలో అనేదానికి ఒక ‘లెక్క’ ఉంది కానీ, వైసీపీ విషయానికి వస్తే ఏ సమయంలో ఎం చెయ్యకూడదో, ఎప్పుడు ఎవరిని రెచ్చకొట్టకూడదో అదే ‘తిక్క’ పనులు చేసి చివరికి మూల్యం చెల్లించుకుంది.
దీనికి చక్కటి ఉదాహరణగా సెప్టెంబర్ 9 నంద్యాలలో చంద్రబాబు అరెస్టు, అదే రోజు రాత్రి నందిగామలో పవన్ కళ్యాణ్ నిర్బంధం. జగన్ తీసుకున్న ఈ రెండు అనాలోచిత నిర్ణయాలకు, తిక్క పనులకు నేడు వైసీపీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు.
అయితే జగన్ ఇప్పటికి తన తిక్కేమిటో, పక్క వాడి లెక్కేమిటి పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు అనేది తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల విషయంలో కోర్ట్ కెళ్లడంతో రుజువయ్యింది. అక్కడ కేటీఆర్ లిక్కర్ స్కాములో అరెస్టయిన చెల్లి కవితను బయటకు తెస్తే ఇక్కడ చెల్లితో పాటు తల్లిని కూడా కోర్టుకీడ్చారు జగన్.




