గత వారంలో విడుదలైన బింబిసార, సీతా రామం, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ మూడూ సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో గోరంట్ల డర్టీ పిక్చర్ క్రెడిట్ పూర్తిగా టిడిపిదేనని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నిన్న అనకాపల్లి జిల్లాలో రైవాడ అతిధి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“టిడిపి నేతలు సమాజానికి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని గోరంట్ల మాధవ్ నగ్న వీడియో గురించి పదేపదే మాట్లాడుతూ మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకి దిక్సూచిగా ఉండవలసిన మీడియా నిరాధారమైన వార్తలు రాస్తూ తన స్థాయిని దిగజార్చుకొంటోంది. ఆ వీడియో ఒరిజినల్ కాదని మా ఎంపీ గోరంట్ల మాధవ్ చెపుతున్నారు. అయినా టిడిపి నేతలు అదే విషయం గురించి పదేపదే మాట్లాడుతున్నారు. అంతకంటే అభివృద్ధి, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది కదా?” అని అన్నారు.
అసలు గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ విడుదలైన వెంటనే ప్రతిపక్షాలు గుర్తుచేయక ముందే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనపై చర్యలు తీసుకొని ఉండి ఉంటే టిడిపికి దాని గురించి మాట్లాడే అవకాశమే ఉండేది కాదు కదా?ఇక మీడియా, ప్రతిపక్షాలు నిత్యం ప్రజాసమస్యల గురించి జగన్ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలు పడి వర్షాలకు గొలుసు కట్టు చెరువుల్లా మారాయని ఫోటోలు, వీడియోలతో సహా ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నాయి కానీ జగన్ ప్రభుత్వమే నేటికీ పట్టించుకోలేదు. పాటశాలల విలీనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ధర్నాలు చేసినా పట్టించుకోలేదు.
ఏపీలో జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పధకాల గోల తప్ప అభివృద్ధి ఊసే లేదు. కనుక అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సంక్షేమ పధకాలు, జగన్ డప్పు కొట్టుకొంటూ కాలక్షేపం చేసేస్తుంటే, రాష్ట్రంలో అసలు ఏమి అభివృద్ధి జరిగిందని ప్రతిపక్షాలు అడగగలవు. అప్పటికీ పరిశ్రమలు, పెట్టుబడులు, అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల గురించి గుర్తు చేస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పట్లో అయ్యే పనులు కావని జగన్ ప్రభుత్వమే చెప్పుకొంటోంది కదా?మరి ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి గురించి అడగాలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడే చెపితే బాగుంటుంది కదా?



