ఉద్యోగులకు జీతాలు కష్టం కానీ ఏపీ బడ్జెట్‌ 2.86 లక్షల కోట్లు…

Buggana Rajendranath Reddy Andhra Pradesh Budget 2024

బడ్జెట్‌ అంటే ఎప్పుడూ మాటలు, అంకెల గారడీగానే ఉంటుంది. నేడు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌, ఆయన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.2,86,389 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

ADVERTISEMENT

దానిలో రెవెన్యూ వ్యయం రూ.2,30,100 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లు. రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు, ద్రవ్య లోటు రూ.55,817 కోట్లు, జీఎస్దీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం, రెవెన్యూ లోటు 1.56 శాతం ఉంటుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నులలో వాటాగా రూ.49,286 కోట్లు, రాష్ట్రంలో వసూలు అయ్యే పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు, ఇతర ఆదాయం రూ.14,400 కోట్లు, గ్రాంట్ ఇన్‌ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు కలిపి మొత్తం రూ. 2,05,352 కోట్లు ఆదాయం వస్తుందని మంత్రి బుగ్గన చెప్పారు.

శాసనసభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతుంది. కనుక ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో జూలై వరకు చేసిన కేటాయింపులకు మాత్రమే శాసనసభ సమావేశాలలో ఆమోదం తెలుపుతారు.

రాష్ట్ర విభజన, కరోనా, లాక్‌డౌన్‌ వలన జరిగిన ఆర్ధిక నష్టం కంటే ఈ 57 నెలల్లో జగన్‌ ప్రభుత్వ పాలనలో జరిగిన నష్టమే చాలా ఎక్కువని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు.

జగన్‌ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కనుక పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నామని సాక్షాత్ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితమే పార్లమెంట్‌లో చెప్పారు.

కనుక ఈ అంకెల గారడీ, బుగ్గన మాటల గారడీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. మళ్ళీ మేమే తప్పకుండా అధికారంలోకి వచ్చి పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెడతామని జగన్‌ చెప్పుకున్నారు. కానీ మళ్ళీ వస్తే ఆయనకే ఈ బడ్జెట్‌ తలకు మించిన భారంగా మారుతుంది.

ఒకవేళ టిడిపి, జనసేనలు అధికారంలోకి వచ్చినా జగన్‌ చేసిన ఈ నష్టాన్ని పూడ్చుకుని, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకునేందుకు మరో 5,10 ఏళ్ళు శ్రమించినా సరిపోదని చంద్రబాబు నాయుడు చెపుతూనే ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories