తెలుగు సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ పుట్టిల్లు వంటిదైతే, తెలంగాణ అత్తవారిల్లు వంటిదని చెప్పవచ్చు. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో కష్టం వస్తే పుట్టింటికి వస్తుంది. కానీ తెలుగు సినీ పరిశ్రమకి అత్తారింట్లోనే ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తుండగా, గత ఈ 5 ఏళ్ళుగా పుట్టింటిలోనే అనేక అవమానాలు, కష్టాలు, నష్టాలు అనుభవించింది.
మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించగా, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన ఎదుట చేతులు జోడించి ప్రార్ధించేలా చేసి అవమానించారు.
రాజమౌళి తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ సాధించి జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగువారి పేరు మారుమ్రోగిపోయేలా చేశారు. కానీ జగన్ ఆయనతో సహా పలువురు తెలుగు సినీ ప్రముఖుల పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించారు. అంతటితో తృప్తి కలగన్నట్లు ఆ ఫోటోలు, వీడియోలు మీడియాకు లీక్ అయ్యేలా చేసి పైశాచిక ఆనందం అనుభవించారు.
ఇక జగన్ రాజకీయ శత్రువులైన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్ని ఆటంకాలు కలిగించారో, వారి పట్ల ఎంత అవహేళనగా మాట్లాడేవారో అందరికీ తెలుసు.
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలు, అవమానాలు, ఈసడింపులని చూసి భయపడిన తెలుగు సినీ పరిశ్రమ, రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ వేధింపులను భరించడం కష్టమని, ఏపీకి తరలివచ్చేయాలని ఆలోచనలు కూడా చేసింది.
కానీ సినీ పరిశ్రమ వలన ప్రభుత్వానికి భారీగా ఆదాయం, వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని, బిఆర్ఎస్ పార్టీకి అవసరమైనప్పుడు భారీగా విరాళాలు అందించగలదని గ్రహించిన కేసీఆర్, వెంటనే తన ధోరణి మార్చుకొని సినీ పరిశ్రమని అక్కున చేర్చుకున్నారు. సినీ ప్రముఖులకు అత్యంత గౌరవం ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణవాదం వినిపించేవారిని కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయింది.
కేసీఆర్‌కి ఉన్న ఈ తెలివి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం వలన అహంభావంతో వ్యవహరిస్తూ చిరంజీవి, రజనీకాంత్ వంటి ప్రముఖులని కూడా చాలా అవమానించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాని కూడా మరిచి పవన్ కళ్యాణ్‌ని అతిదారుణంగా అవమానించారు. అవహేళన చేశారు.
సినీ పరిశ్రమకు చెందిన రాంగోపాల్ వర్మ, పోసాని, రోజా వంటివారిని కూడా జగన్ తప్పుడు మార్గంలో నడిపించి వారి భవిష్యత్ కూడా నాశనం చేశారు.
అందుకే సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ జగన్ ఓడిపోవాలని కోరుకొన్నారు. అందరూ కలిసి ఓడించారు. టిడిపి, జనసేన, బీజేపీల కూటమిని భారీ మజార్టీతో గెలిపించుకున్నారు కూడా.
ఈ మార్పు చాలా అభినందనీయం. తెలుగు సినీ పరిశ్రమకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని తెలియజేస్తోంది కూడా. చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి వేదికపై ప్రధాని మోడీ పక్కనే స్థానం కల్పించినప్పుడే తెలుగు సినీ పరిశ్రమకు జరిగిన అవమానాలకు ఉపశమనం కల్పించి మంచి రోజులు మొదలయ్యాయని సూచించినట్లయింది.
ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సిఎం, డెప్యూటీ సిఎంలుగా ఉన్నారు. జనసేనకు చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ముందుగా ఆయన హైదరాబాద్‌లో విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి, సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తానని మాటిచ్చారు.
ఆనాడు నందమూరి తారక రామారావు మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్‌కు రప్పించి ఆత్మగౌరవం కల్పించారు. ఇప్పుడు ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్,కందుల దుర్గేష్‌ల మీద ఉంది. వారు ఈ 5 ఏళ్ళలో తెలుగు సినీ పరిశ్రమని ఏపీలో కూడా విస్తరించేలా చేయగలిగితే దానికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మహోపకారం చేసినవారవుతారు.




